Published On:

Iran: ఇరాన్‌కు రూ.2.5 లక్షల కోట్లు: పరిశీలిస్తున్న ట్రంప్‌ కార్యవర్గం

Iran: ఇరాన్‌కు రూ.2.5 లక్షల కోట్లు: పరిశీలిస్తున్న ట్రంప్‌ కార్యవర్గం

Donald Trump: ప్రజల అవసరాల కోసం అణు విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ఇరాన్‌కు సహకరించే అంశాన్ని డొనాల్డ్ ట్రంప్‌ కార్యవర్గం పరిశీలిస్తోంది. టెహ్రాన్‌కు 30 బిలియన్‌ డాలర్లు.. దాదాపు రూ.2.5 లక్షల కోట్లు సాయం చేసేలా ప్రతిపాదన ఉన్నట్లు పేర్కొంది. టెహ్రాన్‌ను ఎలాగైనా చర్చలకు టేబుల్‌ పైకి తీసుకువచ్చేలా యూఎస్ ప్రయత్నాలు చేస్తోంది.

 

ఇరాన్‌లోని మూడు అణుకేంద్రాలపై అమెరికా దాడులు నిర్వహించింది. అనంతరం ట్రంప్‌ పశ్చిమాసియా ప్రతినిధి స్టీవ్‌ విట్కాఫ్‌, గల్ఫ్‌ దేశాల ప్రతినిధులతో శ్వేతసౌధంలో భేటీ అయ్యారు. అదే సమయంలో కొందరు అమెరికా, పశ్చిమాసియా ప్రతినిధులు ఇరాన్‌కు చెందిన కీలక నాయకులతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణను ప్రకటించిన తర్వాత చర్చలు కొనసాగుతున్నట్లు సీఎన్ఎన్‌ వెల్లడించింది. అయితే, ఇరాన్‌ అణుశుద్ధి చేపట్టకూడదన్న తమ విధానంలో మాత్రం ఎటువంటి రాజీ పడకూడదని యూఎస్ భావిస్తోంది. పౌర అణు కార్యక్రమానికి 20 నుంచి 30 బిలియన్‌ డాలర్ల ఖర్చు అవుతాయని అంచనాకు వచ్చింది.

 

అరబ్‌ భాగస్వాములు కూడా ఖర్చులో కొంత పంచుకోవాలని అమెరికా ఆశిస్తోంది. కొన్నాళ్ల కింద ఇరాన్‌-అమెరికా మధ్య చర్చల్లో పౌర అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటు అంశం ప్రస్తావనకు వచ్చింది. ఆంక్షల తొలగింపుతోపాటు, వివిధ బ్యాంకుల్లో యూఎస్ స్తంభింపజేసిన 6 బిలియన్‌ డాలర్లను వినియోగించుకునే అవకాశం కల్పించాలన్న ప్రతిపాదన వచ్చింది.

 

మరోవైపు ఇరాన్‌ మాత్రం అణుచర్చలు జరిపే ఉద్దేశం తమకు లేదని తేల్చిచెప్పింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ విషయాన్ని వెల్లడించారు. యూఎస్ చేసిన దాడులు తమ అణుకేంద్రాలకు తీవ్ర నష్టం కలిగించాయని తెలిపారు. ప్రస్తుతం చర్చల కోసం ఖతార్‌ మధ్యవర్తిత్వం వహిస్తోందని శ్వేతసౌధం ప్రెస్‌ సెక్రటరీ కరోలినా లీవిట్‌ వెల్లడించారు. ఇటీవల జరిగిన నాటో సదస్సులో ట్రంప్‌ మాట్లాడారు. వచ్చే వారం టెహ్రాన్‌తో చర్చలు జరుపుతానని ప్రకటించారు.

ఇవి కూడా చదవండి: