Minister Rajnath Singh: చైనాలో పాకిస్తాన్ ను ఏకిపారేసిన రాజ్ నాథ్

Rajnath slams On Pakistan: చైనాలోని కింగ్ డావోలో షాంఘై సహకార సంస్థ రక్షణ మంత్రుల సమావేశం జరుగుతోంది. సమావేశానికి భారత్ తరపున రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరయ్యారు. గల్వాన్ లోయలో జరిగిన ఘటన తర్వాత రాజ్ నాథ్ చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి. కాగా రాజనాథ్ నేతృత్వంలోని భారత బృందానికి చైనా రక్షణ మంత్రి డాంగ్ జున్ స్వాగతం పలికారు. ఇతర నాయకులతో కలిసి రాజనాథ్ ఫోటోలు దిగారు.
అనంతరం సమావేశంలో పాల్గొన్న మంత్రి రాజ్ నాథ్ పాకిస్తాన్ మిత్రదేశం చైనా ముందే దాయాది పాకిస్తాన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని మండిపడ్డారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరూ పోరాడాలని సూచించారు. ఈ మేరకు ఎస్సీఓ సభ్య దేశాలు ఉగ్రవాదాన్ని ముక్త కంఠంతో ఖండించాలని కోరారు. ఉగ్రవాదం, శాంతి కలిసి ఉండలేవని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పహల్గామ్ దాడి గురించి మంత్రి రాజ్ నాథ్ ప్రస్తావించారు. లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు పహల్గామ్ లో పర్యాటకలపై దాడి చేశారని తెలిపారు. అందుకే దేశ భద్రత కోసం మే7న ఆపరేషన్ సిందూర్ నిర్వహించామన్నారు. ఇంకోసారి ఇలాంటి దాడులు చేస్తే భారత్ కచ్చితంగా తగిన జవాబు ఇస్తుందని మంత్రి రాజ్ నాథ్ హెచ్చరించారు. శాంతి, భద్రత కోసం తాము పోరాడుతున్నామని వెల్లడించారు.