Published On:

Iran Supreme: ఇరాన్‌లో ఇస్లామిక్‌ విప్లవం.. సుప్రీం లీడర్ ఖమేనీ, ఇండియాకు లింకులేంటో తెలుసా?

Iran Supreme: ఇరాన్‌లో ఇస్లామిక్‌ విప్లవం.. సుప్రీం లీడర్ ఖమేనీ, ఇండియాకు లింకులేంటో తెలుసా?

Iran Supreme Ayatollah Khamenei India Connection: ప్రస్తుతం యావత్‌ ప్రపంచం ఫోకస్‌ అంతా ఇజ్రాయెల్‌ – ఇరాన్‌ యుద్ధం పైనే కేంద్రీకృతమైంది. తాజాగా ట్రంప్‌ చొరవతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే మిడిల్‌ ఈస్ట్‌లో గత కొన్ని సంవత్సరాలుగా ఈ రెండు దేశాల మధ్య వివాదం కొనసాగుతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధం వల్ల ఇరాన్‌లో అధికార మార్పిడి జరిగినా జరగవచ్చు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆధునిక యుద్ధం కంటే ముందు ఇరాన్‌లో ఒకసారి అధికార మార్పిడి జరిగింది. 1979లో ఇరాన్‌లో జరగిన ఇస్లామిక్‌ విప్లవంలో ఇరాన్‌ షాను ప్రజలు గద్దె దించారు. అయితే ఈ విప్లవం వెనుక ఇండియాలోని ఉత్తరప్రదేశ్‌లోని అతి చిన్న గ్రామంలో దాని మూలాలున్నాయని చాలా మందికి తెలియకపోవచ్చు. ప్రస్తుతం ఇరాన్‌కు ఇండియాకు లింకులేంటో ప్రత్యేక కథనంలో దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం.

ప్రస్తుతం ఇజ్రాయెల్‌ – ఇరాన్‌ యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. ఇజ్రాయెల్‌ దాడులను ఇరాన్‌ ధీటుగా ఎదుర్కొంటోంది. అయితే ఇరాన్‌ సుప్రీంలీడర్ల మూలాలు ఇండియాలో ఉన్నాయంటే ఆశ్చర్యపోవాల్సిందే. ప్రస్తుతం పశ్చిమాసియా అగ్ని గుండంగా మారింది. ఇజ్రాయెల్‌.. ఇటు ఇరాన్‌తో పాటు.. పాలస్తీనా., లెబనాన్‌లోని హెజబొల్లా మిలిటెంట్లతో పాటు యెమెన్‌లోని హౌతీ మిలిటెంట్లతో ఒంటి చేత్తో పోరాటం చేస్తోంది. అయితే ఇజ్రాయెల్‌ దాడులను ఇరాన్‌ గట్టిగా ఎదుర్కొంటోంది. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ వెనుక యావత్‌ ఇరాన్‌ బలంగా నిలిచింది. ఆయన నాయకత్వంలో ఇరాన్‌ సైనికులు ఇజ్రాయెల్‌తో ధీటుగా పోరాడుతున్నారు. అయితే ఇరాన్‌లో ఇస్లామిక్‌ విప్లవం మూలాలకు ఇండియాలోని ఉత్తర ప్రదేశ్‌లో బీజం పడింది. ఇక అసలు విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్‌ నుంచి షియా మతాధిపతి సయ్యద్‌ అహ్మద్‌ ముసావి 19వ శతాబ్దంలో ఇరాన్‌కు వలస వెళ్లారు.

 

ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలోని కింటూర్‌ అనేది ఓ చిన్న గ్రామం. ఈ గ్రామానికి 1800 సంవత్సరం ప్రారంభంలో సయ్యద్‌ అహ్మద్‌ ముసావి హింది కుటుంబం ఇరాన్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌కు వలస వచ్చిన కుటుంబంలో జన్మించాడు. కాగా ముసావి కుటుంబం ముస్లింలలో షియా తెగకు చెందిన వారు. ఇక ఇరాన్‌ విషయానికి వస్తే 95 శాతం మంది ప్రజలు షియా తెగకు చెందిన వారే. 1800 సంవత్సరంలో ఇండియాలో బ్రిటిష్‌ వారి పాలన కొనసాగుతోంది. బ్రిటిష్‌ వారి ఈస్ట్‌ ఇండియా కంపెనీ భారత ఉపఖండంలో గట్టి పట్టును సాధించింది. అదే సమయంలో ఇండియాలో మొగలుల ప్రాబల్యం క్రమంగా మసకబారుతోంది. ఇక యూపీలోని కింటూర్‌లో ఒక షియా మత గురువు ఇంట్లో పుట్టిన అహ్మద్‌ ముసావి హింది ఇండియా నుంచి తన ప్రయాణాన్ని ఇరాన్‌కు కొనసాగించారు. 1830లో ఆయన కింటూర్‌ నుంచి ఇరాక్‌లోని నజాఫ్‌కు పయనమయ్యారు. ఇక నజాఫ్‌ విషయానికి వస్తే ఇరాక్‌లో షియా మతస్తులకు అత్యంత పవిత్ర స్థలం. ఇక అహ్మద్‌ ముసావి హింది నజాఫ్‌లో ఇమామ్ అలీ సమాధిని దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచి ఇండియాకు తిరిగి రాలేదు.

 

ఇక నజాఫ్‌కు వెళ్లిన ముసావి అక్కడే కొన్ని సంవత్సరాల పాటు గడిపి .. తర్వాత ఇరాన్‌లోని కొమియెన్‌ పట్టణంలో స్థిరపడ్డాడు. అక్కడే ఆయన పెళ్లి చేసుకొని పిల్లల్ని కని పిల్లల్ని పెంచి పెద్ద చేశాడు. ఇరాన్‌లోని షియా మతగురువలతో కలిసి పోయాడు. అయతే ఇరానియన్‌ సమాజంలో కలిసి పోయినా.. ఆయన తన మూలాలను మరచిపోలేదు. తన హిందీ పేరు టైటిల్‌ను చివరి వరకు కొనసాగించారు. తన పుట్టిన ఊరు ఇండియాలోని పేరుతో పాటు ‘హిందీ’ టైటిల్‌ను చివరి వరకు కొనసాగించారని ఇరానియన్‌ రికార్డుల్లో ఇప్పటి ఉందట. ఇక అహ్మద్‌ ముసావి హిందీ 1869లో కన్నుమూశారు. ఆయనను ఇరాక్‌లోని కర్బాలాలో ఖననం చేశారు. అయితే షియా మత గురువుగా ఆయన వారసత్వాన్ని ఆయన మత బోధలను, ఆయనకు ఇస్లాం పట్ల ఉన్న నమ్మకాన్ని ఆయన కుమారుడు కొసాగించారు. ఇరాన్‌లోని అతి పెద్ద మతగురువుల కుటుంబంలో అమ్మద్‌ ముసావి కుటుంబం అతి పెద్దది.

 

ఇదిలా ఉండగా అహ్మద్‌ ముసావి హిందీ మనవుడు 1902లో పుట్టాడు. అతనికి రుహుల్లా అని పేరు పెట్టారు. ఇక రుహుల్లా ఇరాన్‌ ఇస్లామికి విప్లవానికి పితామహుడిగా ఎదిగారు. ఇరాన్‌కు మొట్టమొదటి సుప్రీం లీడర్‌ రుహుల్లా ఖొమేనీ అయ్యారు. 1960లో ఖొమేనీ ఇరాన్‌ షా రెజా పెహల్వీకి వ్యతిరేకంగా ఉద్యమం మొదలుపెట్టారు. ఆయన పాశ్చాత్యపోకడలను ఖొమేనీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఖొమెనీ సిద్దాంతాలు షియా సమాజంలో బలంగా నాటుకుపోయాయి. ఆయన కుటుంబం తరతరాల బోధనలు ఇరాన్‌లోని షియామతస్తులను బాగా ఆకర్షించాయి. ఇక అమ్మద్‌ ముసావి హిందీ కూడా షియా మత గురువే . ఆయన ఇస్లామిక్‌ బోధనలను వంశపారంపర్యంగా ఖొమేనీ అందిపుచ్చుకున్నారు. కాగా ఖొమేనీ తన తాతను ముసావి హిందీని కలిసే అవకాశం లేకుండా పోయింది.

 

ఇరాన్‌ షాకు వ్యతిరేకంగా ఇరాన్‌లో అతి పెద్ద విప్లవం మొదలైంది. ఉద్యమాన్ని ఇరాన్‌ షా ఉక్కుపాదంతో అణచడానికి ప్రయత్నించాడు. దీంతొ ఖొమేనీ ప్రవాసం నుంచి ఉద్యమాన్ని నడిపించారు. ఖొమెనీ దాదాపు 12 సంవత్సరాల పాటు ప్రవాసం నుంచి ఉద్యమాన్ని కొనసాగించారు. ఆయన షియా మతస్తులకు అత్యంత పవిత్ర నగరమైన ఇరాక్‌లోని నజాప్‌ నుంచి ఇరాన్‌ షా ను గద్దె దించడానికి ఉద్యమం చేపట్టారు. ముందుగా ఇరాన్‌ నుంచి నవంబర్‌ 4, 1964 టర్కీకి వెళ్లారు. అక్కడ ఆయన టర్కిష్‌ ఇంటెలిజెన్స్‌సెంటర్‌లో అక్టోబర్‌ 1965 వరకు గడిపారు. ఏడాది కంటే తక్కువ కాలం గడిపిన తర్వాత ఆయన ఇరాక్‌లోని నజాఫ్‌కు వెళ్లడానికి అనుమతించారు. ఖొమేనీ 1978 వరకు ఇరార్‌లోని నజాప్‌లో నివసించారు. అయితే ఇరాక్‌లో అప్పుడు వైస్‌ ప్రెసిడెంట్‌గా సద్దామ్‌ హుస్సేన్‌ ఉన్నారు. ఆయన ఖొమేనీని దేశం నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. 1978లోనే ఇరాన్‌లో షాకు వ్యతిరేకంగా ఉద్యమం తారాస్థాయికి చేరింది. సద్దాం ఖొమేనీని దేశం నుంచి బహిష్కరించిన తర్వాత ఆయన అక్టోబర్‌ 6, 1978లో టూరిస్టు వీసాపై పారిస్‌ శివార్లలో కాలం గడిపారు.

 

1979లో ఇరాన్‌ షా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత ఆయన ఇరాన్‌కు వచ్చారు. ఇరాన్‌లో అప్పుడే మొట్టమొదటి ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇరాన్‌ పుట్టింది. దీనికి ఖొమేనీ సుప్రీంలీడర్‌ అయ్యారు. ఇరాన్‌ రాచరిక పాలన నుంచి కఠినమైన మతతత్వపార్టీ గా మారింది. ఇక ఖొమేనీ బాద్యతలు స్వీకరించిన తర్వాత పాలన అంతా మారిపోయింది. అమెరికాతో పాటు దాని ప్రాంతీయ మిత్రపక్షాలైన సౌదీ అరేబియాతో పాటు ఇజ్రాయెల్‌ను వ్యతిరేకించడం మొదలుపెట్టారు. దేశంలోని చట్టాలను.. పాలనను, విదేశాంగ విధానం అంతా మారిపోయింది. మొత్తం ఇస్లామిక్‌ మతానుసారం పాలన కొనసాగించారు. ఎక్కడ చూసినా ఖొమేనీ ఫోటోలే దర్శనమిచ్చేవి. ఇరాన్‌ కెరెన్సీ నుంచి కుడ్య చిత్రాలతో పాటు స్కూల్‌ పుస్తకాల్లో ఆయన బోధనల్లో ఆయన ఫోటోలే కనిపించేవి. అయితే ఆయన కవితల్లో కానీ గజల్స్‌లో కానీ తరచూ హింద్‌ అనే పదం ఖచ్చితంగా వినిపించేంది. తన తాత పుట్టిన భూమిని మరవరాదనే ఉద్దేశంతో హింది అనే పదాన్ని కొనసాగించారు.

 

ఇరాన్‌ మొట్టమొదటి ఇస్లామిక్‌ పాలన వ్యవస్థాపకుడు అయుతుల్లా రుహుల్లా ఖొమేనీ మూలాల విషయానికి వస్తే ఇండియాలోని ఉత్తరప్రదేశ్‌లో ఉన్నాయి. ఆయన తాత సయ్యద్‌ అమ్మద్‌ ముసావి హిందీ. ఇండియా నుంచి ఇరాన్‌ వలస వెళ్లారు. ప్రస్తుతం ఇరాన్‌ సుప్రీం లీడర్‌గా కొనసాగుతున్న అయతుల్లా అలీ ఖమేనీ విషయానికి వస్తే ఆయన షియాలోనే వేరే తెగకు చెందిన వారు. ఆయనకు ఇండియాతో ఎలాంటి లింకులు లేవు. అయితే ఖమేనీ.. ఖొమేనీ ఇద్దరు షియా మతగురువులే వారి సంప్రదాయలు, సైద్దాంతిక మూలాలు, ముస్లిం మత విద్య అంతా ఒక్కటిగానే ఉంటాయి.. అయితే వారి కుటుంబ నేపధ్యాలు మాత్రం వేర్వేరుగా ఉన్నాయి.

 

ఇరాన్‌లో ఇప్పటికి మతాధికారుల నేతృత్వంలో ఇస్లామిక్‌ రూల్‌ నడుస్తోంది. దాని సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ దేశాన్ని ముందుండి నడిపిస్తున్నారు. పౌర ప్రభుత్వం కొనసాగుతున్నా.. చివరకు తుది నిర్ణయం తీసుకునేది మాత్రం ఖమేనీని.. ఇక ఇరాన్‌లో ఇరాన్‌ షా పాలనను అంతం చేసింది మాత్రం ఇండియా నుంచి వలస వెళ్లిన ఓ షియా మత గురువు మనవడు అన్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ నిజం అదే..ప్రస్తుతం ఆ బాధ్యతను అయతుల్లా అలీ ఖమేనీ తన భుజం మీద వేసుకున్నాడు. అయితే ఇస్లామిక్‌ పాలన పట్ల ప్రజల్లో నిరసనలు వ్యక్తం అవుతోంది. ఇస్లామిక్‌ పాలన పట్ల ప్రజలు ఉద్యమిస్తే… ఆ ఉద్యమాలను ఉక్కుపాదంతో అణిచి వేస్తున్నారు ఇస్లామిక్‌ రూలర్స్‌. మరి ఇజ్రాయెల్‌ యుద్ధం తర్వాత ఇస్లామిక్‌ రూల్‌ ఉంటుందా ఊడుతుందా అనేది కాలమే చెప్పాలి.

ఇవి కూడా చదవండి: