Bonalu: తొలి బోనమెత్తిన హైదరాబాద్.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన స్పీకర్

Bonalu 2025: హైదరాబాద్‌లో ఆషాడ మాస బోనాల ఉత్సావాలు ప్రారంభమయ్యాయి. గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరపున స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ పట్టువస్త్రాలు, తొలి బోనం సమర్పించారు. బోనాల పండుగను అంగరంగవైభవంగా నిర్వహిస్తామన్నారు మంత్రి పొన్నం. బోనాల సందర్భంగా 3 వేల దేవాలయాలకు ప్రభుత్వం 20 కోట్ల రూపాయల నిధులు కేటాయించిందన్నారు.
నెల రోజుల పాటు వివిధ ఆలయాల్లో బోనాలు సమర్పిస్తూ రంగం కార్యక్రమాలు ఉంటాయన్నారు. జగదాంబ అమ్మవారి ఆశీర్వాదంతో ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవాలని.. పాడి, పంటలతో అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్టు మంత్రి పొన్నం తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.