PM Modi: టెక్స్‌టైల్ ఎగుమతిదారుల్లో భారత్ ఆరో స్థానం.. రూ.9లక్షల కోట్లకు పెంచడమే లక్ష్యం

PM Modi sets Rs 9L crore exports target for textile sector before 2030: ప్రపంచంలో టెక్స్‌టైల్ ఎగుమతిదారుల్లో భారత్ ఆరో స్థానానికి చేరడం ఎంతో గొప్ప విషయమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఆదివారం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన భారత్ టెక్స్- 2025కు మోదీ హాజరయ్యారు. భారత్ టెక్స్ ఇప్పుడు ఒక మెగా గ్లోబల్ టెక్స్‌టైల్ ఈవెంట్‌గా మారిందన్నారు. 2030 నాటికి వస్త్ర ఎగుమతలను రూ.9 లక్షల కోట్లకు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే 2030 కంటే ముందు ఆ లక్ష్యాన్ని చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.
వస్త్ర రంగంలో భారత్ ఉనికి..
భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో ఆరవ అతిపెద్ద వస్త్ర ఎగుమతిదారుగా ఉందన్నారు. 2030 నాటికి వస్త్ర ఎగుమతులను ప్రస్తుత రూ.3 లక్షల కోట్ల నుంచి రూ.9 లక్షల కోట్లకు పెంచడమే లక్ష్యమన్నారు. వస్త్ర రంగంలో భారతదేశం తన ఉనికిని చాటుకుంటోందని చెప్పారు. భారతదేశం అధిక-గ్రేడ్ కార్బన్ ఫైబర్ తయారీ వైపు పయనిస్తోందని పేర్కొన్నారు. వస్త్ర రంగానికి అవసరమైన నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులను తయారు చేవడానికి ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. వస్త్ర రంగం గతేడాది 7 శాతం వృద్ధిని నమోదు చేసిందని మోదీ కొనియాడారు.
సాంకేతిక వస్త్ర రంగంపై దృష్టి..
ప్రభుత్వం సాంకేతిక వస్త్ర రంగంపై దృష్టి సారించిందని చెప్పారు. టెక్స్‌టైల్ రంగానికి బ్యాంకులు సహాయ సహకారాలు అందించాలని సూచించారు. టెక్స్‌టైల్ రంగం మరింత అభివృద్ధి చెంది ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలని కోరారు. ఢిల్లీలో జరుగుతున్న భారత్ టెక్స్-2025 కార్యక్రమం ఈ నెల 14 నుంచి 17వ వరకు కొనసాగుతుంది. కార్యక్రమంలో 120కి పైగా దేశాలు పాల్గొంటున్నాయి.