Inter Exam Results : ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫలితాలు ఆ రోజే..

Inter Exam Results : ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పరీక్షలు ఫలితాలు విడుదల చేయడానికి ఇంటర్ బోర్డు సిద్ధమైంది. ఈ నెల 22న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇంటర్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం ఫలితాలను ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. నాంపల్లిలో ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఈ నెల 22న ఉదయం 11గంటలకు భట్టి విక్రమార్క ఫలితాలను రిలీజ్ చేస్తారని ఇంటర్మీడియెట్ బోర్డు వెల్లడించింది. కార్యక్రమంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్యతోపాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొనే అవకాశం ఉంది. ఫలితాలు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.inలో అందుబాటులో ఉండనున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియెట్ పరీక్షలు మార్చి 5వ తేదీ నుంచి 25 వరకు జరిగాయి. 9, 96,971 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మార్చి 18తేదీ నుంచి 19 కేంద్రాల్లో స్పాట్ వాల్యుయేషన్‌ను ఇంటర్ బోర్డు ప్రారంభించింది. అనుకున్న సమయానికి ఫలితాలు రిలీజ్ చేసేలా పకడ్బందీగా చర్యలు చేపట్టింది. మొదటిసారిగా ర్యాండం రీవాల్యుయేషన్ నిర్వహించి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇంటర్ బోర్డు తగిన జాగ్రత్తలు తీసుకుంది. ఫలితాల వెల్లడి తర్వాత రీకౌంటింగ్, రీవాల్యుయేషన్‌కు అవకాశం ఇవ్వనున్నారు. నెల రోజుల్లో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయనున్నారు.