Notices to BRS MLC Pochampally: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కోడిపందేల కేసులో ఎమ్మెల్సీ పోచంపల్లికి నోటీసులు..!
![Notices to BRS MLC Pochampally: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కోడిపందేల కేసులో ఎమ్మెల్సీ పోచంపల్లికి నోటీసులు..!](https://s3.ap-south-1.amazonaws.com/media.prime9news.com/wp-content/uploads/2025/02/cockfightpochampallysrinivasreddy.jpg)
Notices To BRS MLC Pochampally Srinivas: కారు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో కోడి పందేలు, క్యాసినో కేసు వ్యవహారంలో పార్టీ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి గురువారం పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.
కీలక నిందితులు వీరే..
ఈ కేసులో పోచంపల్లిపై సెక్షన్ 3 అండ్ 4 గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేయగా, సెక్షన్ 11 యానిమల్ యాక్ట్ కింద మరో కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఏ1గా ఉన్న భూపతిరాజు శివకుమార్ అలియాస్ గబ్బర్ సింగ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సన్నిహితుడనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. ఈ క్రమంలో కేసీఆర్ కుటుంబానికి అత్యంత విధేయుడైన పోచంపల్లికి పోలీసులు నోటీసులు ఇవ్వడం దుమారం రేపుతోంది. ఇటీవల కేటీఆర్ బామ్మర్ది జన్వాడ ఫామ్‌హౌస్ రేవ్ పార్టీ సంచలనం రేపగా, నేడు పోచంపల్లికి నోటీసులు పంపటం చర్చగా మారింది. కోడిపందేలకు సంబంధించి మరి కొంతమందిని విచారించే అవకాశాలు ఉన్నాయి.
పక్కా ఆధారాలతో..
మొయినాబాద్ మండలం తొల్కట్టలో గ్యాంబ్లింగ్‌కు అడ్డాగా మారిన ఫామ్‌హౌస్… ఎమ్మెల్సీ పోచంపల్లికి చెందినదిగా తెలుస్తోంది. సర్వే నంబర్ 165లో 11 ఎకరాలకు పైగా భూమిని చెన్నకేశవులు అనే వ్యక్తి నుంచి పోచంపల్లి కొన్నట్లుగా.. రెవెన్యూ రికార్డులను బట్టి స్పష్టమవుతోంది. అయితే ఫామ్‌హౌస్‌ను పోచంపల్లి నుంచి శివకుమార్ అనే వ్యక్తి లీజుకు తీసుకుని కోడిపందేలు, క్యాసినోలకు అడ్డాగా మార్చినట్లు సమాచారం. గత రెండేళ్లుగా ఇక్కడ నిరాటంకంగా కోడిపందేలు, క్యాసినో నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
ఫామ్‌హౌస్ నాదే : ఎమ్మెల్సీ
నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ ఫామ్‌హౌస్ వివాదంపై స్పందించారు.ఫామ్‌హౌస్ తనదేనని, కానీ, తాను రమేశ్ అనే వ్యక్తికి ఫామ్‌హౌస్‌ను లీజుకు ఇచ్చానని, కానీ, అతడు ఇంకో వ్యక్తికి లీజుకు ఇచ్చాడనే విషయం తనకు తెలియదని వివరణ ఇచ్చారు. ఫామ్‌హౌస్‌కు వెళ్లి దాదాపు ఎనిమిదేళ్లకు పైగా అయిందని పేర్కొన్నారు. ఈ మేరకు లీజు డాక్యుమెంట్లను కూడా పోలీసులకు అందజేశానని ఎమ్మెల్సీ తెలిపారు. కోడిపందేలతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
చిక్కుల్లో కారు పార్టీ..
బీఆర్ఎస్ హయాంలో అనేక అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉండగా తాజాగా కోడిపందేలా వ్యవహారం ఆ పార్టీకి తలనొప్పిగా మారే అవకాశాలు ఉన్నాయి. అసలే అధికారం కోల్పోయి గడ్డు పరిస్థితుల్లో ఉన్న గులాబీ పార్టీ నేతలపై వస్తున్న ఆరోపణలు ఇప్పుడు మరింత చిక్కుల్లో పడేస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో తీగ లాగితే డొంకంతా కదిలినట్లు తొల్కట్ట ఫామ్‌హౌస్ వ్యవహారంలో ఎలాంటి సంచలనాలు వెలుగు చూడబోతున్నాయనేది ఉత్కంఠ రేపుతున్నది.