TG EAPCET 2025 : విద్యార్థులకు అలర్ట్.. ఈ నెల 22 నుంచి అందుబాటులోకి ఈఏపీసెట్ పరీక్ష హాల్ టికెట్లు

TG EAPCET 2025 : రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్ 2025 పరీక్షలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్నాయి. మే 4 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి సంబంధించిన పరీక్షలు ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించనున్నారు. ఇంజినీరింగ్ విభాగానికి మే 2 నుంచి 4 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈఏపీసెట్ పరీక్షలు రోజూ రెండు దశల్లో జరగనున్నాయి. ఉదయం 9 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
124 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు..
రాష్ట్ర వ్యాప్తంగా 124 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి. ఇంజినీరింగ్ విభాగానికి 2,19,420 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు చెందిన 86,101 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షల కోసం హాల్ టికెట్లు విడుదల తేదీలను కూడా అధికారులు ప్రకటించారు. అగ్రికల్చర్, ఫార్మసీ అభ్యర్థులు ఈ నెల 19 నుంచి తమ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఇంజినీరింగ్ అభ్యర్థుల హాల్ టికెట్లు ఈ నెల 22 నుంచి అందుబాటులోకి రానున్నాయి. అధికారులు విద్యార్థులకు పలు కీలక సూచనలు చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రానికి అనుమతి చేయబోమని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రానికి గంట ముందు చేరుకోవాలని అభ్యర్థులకు సూచించారు.