Bhatti Vikramarka : బీఆర్ఎస్ అడ్డగోలుగా అప్పులు తెచ్చింది.. అసెంబ్లీలో భట్టి

Bhatti Vikramarka : గత బీఆర్ఎస్ సర్కారు ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అడ్డగోలుగా అప్పులు తెచ్చిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు. పదేళ్లలో బీఆర్ఎస్ సర్కారు మొత్తం రూ.16.70లక్షల కోట్లు ఖర్చు చేసిందని, ఆ మొత్తంతో ఏం నిర్మించారని ప్రశ్నించారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో ప్రసంగించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
రూ.16.70లక్షల కోట్లతో నాగార్జునసాగర్, ఎస్‌ఆర్‌ఎస్పీ, ఓఆర్‌ఆర్, ఎయిర్‌పోర్టు నిర్మించారా? అని ప్రశ్నించారు. కాళేశ్వరానికి మాత్రమే రూ.లక్ష కోట్లు ఖర్చు చేశారని దుయ్యబట్టారు. అదీ ఇప్పుడు కూలిపోయిందన్నారు. సింగరేణికి రూ.77 వేల కోట్లు బకాయిలు పెట్టిపోయారని, పదేళ్లలో ఏ గ్రామంలోనైనా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించారా? అని ప్రశ్నించారు. అసెంబ్లీ ఆమోదం లేకుండా రూ.2.30లక్షల కోట్లు ఖర్చు చేసిన విషయాన్ని స్వయంగా కాగ్ వెల్లడించిందని భట్టి అన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడూ నిధులను పూర్తిగా ఖర్చు చేయలేదని వివరించారు. భారీగా బడ్జెట్ పెట్టినా నిధులను పూర్తిగా ఖర్చు చేయలేదని వెల్లడించారు. 2016-17లో రూ.8వేల కోట్లు, 2018-19లో రూ.40వేల కోట్లు, 2021-22లో రూ.48వేల కోట్లు, 2022-23లో రూ.52వేల కోట్లకు పైగా, 2023-24లో రూ.58,571 కోట్లు ఖర్చు చేయలేదన్నారు. ఓఆర్‌ఆర్‌ను రూ.7వేల కోట్లకే 30 ఏళ్ల కాలానికి అమ్ముకున్నారని ఆరోపించారు. దొడ్డిదారిన ఓఆర్‌ఆర్, ప్రభుత్వ భూములను అమ్ముకున్నారని ఆరోపించారు. తర్వాత వచ్చే ప్రభుత్వానికి దక్కాల్సిన ఆదాయాన్ని కూడా ముందే తీసుకున్నారని, కేసీఆర్ నెరవేర్చని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.