Revanthreddy : నెల రోజుల్లో గ్రూప్-2, 3 నియామకాలు పూర్తిచేస్తాం : సీఎం రేవంత్

Revanthreddy : రవీంద్ర భారతిలో ఇవాళ ‘కొలువుల పండుగ’కార్యక్రమం జరిగింది. పంచాయతీ రాజ్‌శాఖలో కారుణ్య నియామకాల కింద ఎంపికైన 922 మంది అభ్యర్థులకు ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నిరుద్యోగుల, అమరవీరుల ఆకాంక్షల ఫలితమే తెలంగాణ ఏర్పాటు అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని, నిరుద్యోగులను నట్టేట ముంచారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాది పాలనలో 55 వేల ఉద్యోగ నియామకాలు చేశామని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో మొదటిసారిగా 500 పైచిలుకు గ్రూప్ 1 ఉద్యోగాలు ఇచ్చింది తామేనని స్పష్టం చేశారు. 30, 40 రోజుల్లో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాల నియామకాలు పూర్తిచేస్తామన్నారు.
ప్రతిపక్షాలు ఉద్యోగ నియామకాలు అడ్డుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్ని ప్రక్రియలు పూర్తి చేస్తున్నామన్నారు. నిరుద్యోగులు కోచింగ్ కేంద్రాల చుట్టూ తిరగనివ్వకూడదని నిర్ణయించామని, వెంటనే నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు విడుదల చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్‌లో కూడా ఇదే కొనసాగిస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఏ బాధ్యతలు విస్మరించిందో వాటిని తాము నెరవేరస్తున్నామని పేర్కొన్నారు. పది నెలల్లో తాము చేసిన పనులను 10 ఏళ్లలో మీరు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులను ప్రజలు తిరస్కరిస్తే, ఆయన వెంటనే వేరే పదవులు ఇచ్చారని, మరి ఈ పదేళ్లల్లో ఇంటి పెద్దను కోల్పోయిన బాధలో ఉన్న కుటుంబానికి కారుణ్య నియామకం ఎందుకు చేపట్టలేదని నిలదీశారు. తెలంగాణలో 25 లక్షల మంది రైతులకు రూ.20 వేల కోట్ల రుణమాఫీ చేశామని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని తెలిపారు. 1000 ఆర్టీసీ బస్సులను అందించి వ్యాపారులుగా మార్చామని పేర్కొన్నారు.
43 లక్షల మంది మహిళలకు రూ.500 కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని చెప్పారు. హాస్టల్ విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచామన్నారు. 59 వేల ఉద్యోగ నియామకాలు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. ఒక్క ఏడాదిలో తాను చేశానని తెలిపారు. ప్రజలు తనపై కోపంగా ఉన్నారని ప్రతిపక్షాలు అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఇన్ని పనులు, సంక్షేమ పథకాలు చేసినందుకు తనపై కోపంగా ఉన్నారా అని విపక్షాలను ప్రశ్నించారు. రాజకీయ నాయకులు మాత్రమే మారారని, అధికారులు మాత్రం వారేనని.. తాను ఒక్కసారి ఆర్డర్స్ ఇస్తే వారందరినీ లోపల వేస్తారని తెలిపారు. కానీ తాను కేసీఆర్ లాగా నియంత పనులు చేయలేనని స్పష్టం చేశారు. తనకు ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలుసన్నారు. గత పాలకులకు లేని విజ్ఞత తమకు ఉందన్నారు. సచివాలయానికి రాని కేసీఆర్‌కు పరిపాలనపై పట్టు ఉంటుందా? రోజుకు 18 గంటలు పనిచేసే తనకు, తన మంత్రులకు పట్టు ఉంటుందా అని సీఎం రేవంత్ ప్రతిపక్షాలను ప్రశ్నించారు.