Last Updated:

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోకు భారీగా పెరిగిన ఆదాయం

హైదరాబాద్ మెట్రోకు రోజురోజుకూ ప్రజాదరణ పెరుగుతోంది. గతంతో పోలిస్తే.. మెట్రో ప్రయాణాలు చేసేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఉద్యోగులు, విద్యార్థులు, కామన్‌ పీపుల్స్‌ అంతా సిటీలోని ఓ మూల నుంచి మరో మూలకు వెళ్లేవాళ్లకి మెట్రో ట్రైన్స్‌ మంచి ఆప్షన్‌గా నిలుస్తున్నాయి.

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోకు భారీగా పెరిగిన ఆదాయం

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోకు రోజురోజుకూ ప్రజాదరణ పెరుగుతోంది. గతంతో పోలిస్తే.. మెట్రో ప్రయాణాలు చేసేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఉద్యోగులు, విద్యార్థులు, కామన్‌ పీపుల్స్‌ అంతా సిటీలోని ఓ మూల నుంచి మరో మూలకు వెళ్లేవాళ్లకి మెట్రో ట్రైన్స్‌ మంచి ఆప్షన్‌గా నిలుస్తున్నాయి. ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందనతో మెట్రో సంస్థకు ఆదాయం కూడా భారీగా పెరుగుతోంది. తాజాగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో మెట్రో రైలు సంస్థ ఆదాయన్ని అధికారులు వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే ఆదాయం 105 శాతం పెరగినట్లు అధికారులు తెలిపారు. 2023-24 ఫైనాన్షియల్ ఇయర్‌లో 14 వందల 7 కోట్ల 81 లక్షల రాబడి వచ్చిందన్నారు.

ఆదాయం రెట్టింపు.. (Hyderabad Metro)

గత ఆర్థిక సంవత్సరం 2022-23లో ఈ ఆదాయం 703 కోట్ల 20 లక్షలు అని ఎల్‌అండ్‌టీ అధికారులు స్పష్టం చేశారు. అంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మెట్రో ఆదాయం డబుల్ అయింది. టికెట్ల అమ్మకం ద్వారానే సంస్థకు 611 కోట్ల 48 లక్షల ఆదాయం వచ్చింది. ట్రాన్స్‌పోర్ట్ ఆధారిత అభివృద్ధి నుంచి 796 కోట్ల 33 లక్షల ఆదాయం వచ్చింది. టీవోడీలో మాల్స్, ఆఫీస్ రెంట్లు, టెలికామ్‌ టవర్లు, అడ్వర్టైజ్‌మెంట్ల ద్వారా 284 కోట్ల 30 లక్షల ఆదాయం వచ్చింది. ఇక మెట్రోకి ప్రభుత్వం లీజుపై ఇచ్చిన రాయదుర్గంలోని ల్యాండ్‌ను స్లంప్‌ సేల్‌ రూపంలో బ్రూక్‌ఫీల్డ్‌ కార్పొరేషన్‌, రహేజా గ్రూప్‌నకు బదిలీ చేయడం ద్వారా తొలివిడతలో 511 కోట్ల 73 లక్షల ఆదాయం వచ్చింది.

మెట్రో రైళ్లు హైదరాబాద్‌ నగరంలో ఆరేళ్లుగా నడుస్తున్నాయి. కోవిడ్ సమయంలో మెట్రో భారీగా నష్టాలను మూటకట్టుకుంది. 2022 మార్చి 31 నాటికి నష్టాలు సుమారు 4 వేల 108 కోట్లు ఉండగా.. 2023 మార్చ్ 31 నాటికి 5 వేల 424 కోట్లకు పెరిగాయి. ఈ ఏడాది మార్చి 31 నాటికి నష్టాలు 5 వేల 979 కొట్లుకు చేరినట్లుగా ఆర్థిక నివేదికలో ఎల్అండ్‌టీ వెల్లడించింది. మెట్రో రైలు ఆపరేషన్‌కు దాదాపు 400 కోట్లు, ఉద్యోగాల వేతన ప్రయోజనాలు మరో 36 కోట్లు, పరిపాలన ఇతర ఖర్చులకు ఇంకో 36 కోట్లు అయ్యింది. మెట్రో నిర్మాణం కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులపై చెల్లించిన వడ్డీ గతేడాది 11 వందల 73 కోట్లుగా ఉంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే వడ్డీ భారం స్వల్పంగా తగ్గింది.

మరోవైపు మెట్రోకి ఆదరణ పెరగడానికి కారణం.. ఎండలు ప్రభావం ఒకటే కాదు.. సమయం కలిసి వస్తుందనుకునే వారి సంఖ్య పెరగడంకూడా. సోమవారం ఉదయం రోజు వారీ కంటే ముందే సేవలు ప్రారంభిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు సేవలను పొడిగించారు. గడిచిన రెండు నెలల్లో ప్రయాణికులు గణాంకాలను పరిశీలిస్తే.. ఏప్రిల్‌లో కోటీ 24 లక్షల మంది మెట్రోలో ప్రయాణించారు. రోజువారిగా సగటున 4 లక్షల మందికి పైగానే మెట్రో రైళ్లలో ప్రయాణం చేస్తున్నారు. మే నెలలో కోటీ 31 లక్షల మంది రాకపోకలు సాధించారు. రోజువారి సగటు 4 లక్షల 22 వేలుగా ఉంది. ప్రయాణికుల సంఖ్య 6 లక్షల మందికి పెరగాల్సి ఉందని మెట్రో వర్గాలు అంటుంటే.. ఉదయం, సాయంత్రం కార్యాలయాల వేళల్లో విపరీతంగా రద్దీ ఉంటుందని దానికి సరిపడా మెట్రోలు లేవని ప్రయాణికులు కంప్లైంట్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: