Revanth Reddy : ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో విస్తరణ : సీఎం రేవంత్‌రెడ్డి

Revanth Reddy : ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో సేవలను విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఇందుకు అవసరమైన తుది ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మెట్రో విస్తరణపై సీఎం సమీక్ష నిర్వహించారు. మెట్రో రెండో ఫేజ్ విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి అనుమతులు రావాల్సి ఉందని, ఇప్పటికే ఢిల్లీలో అధికారులను కలిసి సంప్రదింపులు జరిపినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
కొత్త ప్రణాళిక సిద్ధం చేయాలి..
విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్స్ డెవలప్‌మెంట్ వర్సిటీ వరకు 40 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరించేందుకు నూతన ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. 30వేల ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్ నగర విస్తరణ అవసరాల దృష్ట్యా మెట్రోను మీర్‌ఖాన్‌పేట్ వరకు పొడిగించాలన్నారు. అవసరమయ్యే అంచనాలతో డీపీఆర్ తయారు చేసి కేంద్రానికి పంపించాలని అధికారులకు సీఎం సూచించారు. హెచ్‌ఎండీఏ, ఎఫ్ఎస్‌డీఏ సంయుక్తంగా మెట్రో రూట్ విస్తరణ బాధ్యత తీసుకోవాలన్నారు.
రూ.24,269 కోట్ల అంచనాలతో డీపీఆర్..
హైదరాబాద్ మెట్రో రెండో దశలో భాగంగా సుమారు 76.4 కిలోమీటర్ల విస్తరణకు రూ.24,269 కోట్ల అంచనాలతో డీపీఆర్‌ను సిద్ధం చేసి ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం చెరిసగం నిధులు భరించేలా జాయింట్ వెంచర్‌గా ప్రాజెక్టు చేపట్టేలా ప్రతిపాదనలు తయారు చేసింది. కేంద్రం నుంచి అనుమతులు సాధించేందుకు నిరంతరం ప్రయత్నించాలని, అనుమతులు రాగానే పనులు ప్రారంభించేందుకు సన్నద్ధంగా ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ఆర్‌ఆర్ఆర్ పనులను ముమ్మరం చేయాలి..
రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్ఆర్) పనులను ముమ్మరం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించారు. ఆర్‌ఆర్‌ఆర్ సమీపంలోనే భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా డ్రైపోర్ట్ నిర్మాణానికి రూపకల్పన చేయాలని సూచించారు. ఆర్‌ఆర్‌ఆర్, జాతీయ రహదారులపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణంపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.
మూసీ పునరుజ్జీవనంపై సమీక్ష
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. బాపూఘాట్ వద్ద నిర్మించ తలపెట్టిన గాంధీ సరోవర్‌తో పాటు మీర్ ఆలం ట్యాంక్‌పై నిర్మించనున్న బ్రిడ్జి నమూనాలను సీఎం పరిశీలించారు. మీర్ ఆలం ట్యాంక్‌పై బ్రిడ్జి నిర్మాణ పనులకు జూన్‌లో టెండర్లు పిలవాలని సూచించారు. ఈలోపు అందుకు అవసరమైన సర్వేలు, నివేదికలు, ప్రతిపాదనలు, డిజైన్లతో డీపీఆర్‌ను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.