Published On:

India Pakistan War: భారత్- పాక్ యుద్ధం.. మరో జవాన్ వీరమరణం

India Pakistan War: భారత్- పాక్ యుద్ధం.. మరో జవాన్ వీరమరణం

Indian Solder Killed in Jammu Kashmir: భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఇరుదేశాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. పహల్గామ్ దాడి అనంతరం ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు నిర్వహించింది. అందుకు ప్రతీకారంగా భారత్ పైకి పాకిస్తాన్ దాడులకు పాల్పడింది. జమ్మూ, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, మిస్సైళ్లను ప్రయోగించింది. వీటిని భారత ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టింది. మరోవైపు పాక్ దాడులను ధీటుగా ఎదుర్కొన్న భారత్.. పాకిస్తాన్ లోని ఆర్మీ, ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది.

 

భారత్ చేస్తున్న దాడులకు తట్టుకోలేకపోయిన పాకిస్తాన్ చివరికి కాళ్లబేరానికి వచ్చింది. కాల్పుల విరమణ చేయాలని కోరింది. ఈ మేరకు అమెరికా మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల నేతలు ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. చివరకు కాల్పుల విరమణకు ఇరుదేశాలు అంగీకారం తెలుపుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అంతకుముందు నిన్న మధ్యాహ్నం కాల్పుల విరమణకు తమ దేశం సిద్ధంగా ఉందని పాకిస్తాన్ డీజీఎంఓ భారత డీజీఎంఓకు కాల్ చేశారు. మరోవైపు కాల్పుల విరమణ చేస్తున్నట్టు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. నిన్న సాయంత్రం 5 గంటలకు కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినట్టు ఇరుదేశాలు ప్రకటించాయి. కానీ పాక్ మాత్రం తన వంకర బుద్ధిని చూపించింది. భారత్ పై మళ్లీ దాడులు చేసింది.

 

కాగా పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంది. అయితే పాక్ ప్రయోగించిన డ్రోన్ కారణంగా ఓ సైనికుడు అమరుడయ్యాడు. డ్రోన్ ని అడ్డగించిన సమయంలో దాని శకలాల్లోని ఓ భాగం బలంగా తాకడంతో జవాన్ మరణించినట్లు అధికారులు తెలిపారు. నిన్న జమ్ము కాశ్మీర్ లోని ఉదంపూర్ జిల్లాలోని వైమానిక స్థావరంలో ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ డ్రోన్ ని విజయవంతంగా అడ్డగించింది. అయితే డ్రోన్ శిథిలాలు సురేంద్ర సింగ్ మోగా అనే సైనికుడికి తగిలాయి. దీంతో తీవ్రగాయాలతో జవాన్ అక్కడికక్కడే మరణించారు.

 

ఘటనపై రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ విచారం వ్యక్తం చేశారు. అమర జవాన్ కు ఘన నివాళి అర్పించారు. జవాన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. “సురేంద్ర సింగ్ మోగా రాజస్థాన్ బిడ్డ, ఝుంఝును నివాసి. భారత సైన్యంలోని సైనికుడు సురేంద్ర సింగ్ మోగా దేశ భద్రతా కర్తవ్యాలను నిర్వర్తిస్తూ ఉదంపూర్ వైమానిక స్థావరంలో అమరుడయ్యారనే వార్త చాలా విచారకరం” అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.