Hyderabad Metro: ప్రయాణికులకు బిగ్ అలర్ట్..పెరగనున్న మెట్రో ఛార్జీలు!

Hyderabad Metro charges Hike: హైదరాబాద్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్. త్వరలోనే మెట్రో ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎల్ అండ్ టీ సంస్థ నష్టాల్లో కొనసాగుతోందని, మెట్రో నష్టాలను భర్తీ చేసేందుకు మెట్రో రైలు నిర్వహణ సంస్థ ఎల్ అండ్ టీ ఛార్జీలు పెంచే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎంత మేర పెంచాలనే విషయంపై స్పష్టత రావాల్సి ఉందని సమాచారం.
హైదరాబాద్ మెట్రో రైలు 2017 నుంచి ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం వరకు దాదాపు రూ.6,500కోట్ల వరకు నష్టాల్లో ఉన్నట్లు ఎల్ అండ్ టీ సంస్థ తెలిపింది. హైదరాబాద్ నగరంలో 2017 నవంబర్‌లో మెట్రో రైలు ప్రారంభమైంది. దశలవారీగా మెట్రో విస్తరిస్తూ వస్తుంది. అయితే అప్పటినుంచి ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేసరికి నష్టాల్లోనే కొనసాగుతున్నట్లు సంస్థ తెలిపింది. ఈ నష్టాలను భర్తీ చేసుందుకు స్టేషన్లతో పాటు మాల్స్‌లో రిటైల్ స్పేస్ లీజ్, యాడ్స్ వంటి వాటితో ఆదాయం పెంచేందుకు ప్రయత్నిస్తోంది.
ఇదిలా ఉండగా, అంతకుముందు కోవిడ్ కారణంగా హైదరాబాద్ మెట్రో తీవ్రంగా నష్టపోయింది. ఈ మేరకు 2022లో ఎల్ అండ్ టీ సంస్థ మెట్రో ఛార్జీలను సవరించాలని ప్రభుత్వాన్ని కోరగా.. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎఫ్ఎఫ్‌సీని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని అడిగింది. దీంతో కేంద్రం సానుకూలంగా స్పందించి మెట్రో రైల్వే సెక్షన్స్ 33, 34 ఆధారంగా కమిటీ వేసింది. ఈ కమిటీ పలు విషయాలను పరిగణలోకి తీసుకోని అధ్యయనం చేయగా.. ప్రయాణికుల నుంచి అభిప్రాయాలు కోరింది. తర్వాత ఛార్జీలు సవరించాలనే సిఫార్సు వాయిదా పడింది.
అయితే, బెంగళూరులో మెట్రో ఛార్జీలను 44 శాతం వరకు పెంచారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ నగరంలో కూడా మెట్రో ఛార్జీలను పెంచేందుకు ఎల్ అండ టీ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ మెట్రోలో రూ.59 హాలిడే సేవర్ కార్డుతో పాటు రద్దీవేళల్లో మెట్రో కార్డుపై 10 శాతం రాయితీలను తొలగించింది. కాగా, ప్రస్తుతం కనిష్ట ఛార్జీ రూ.10 ఉండగా, గరిష్ట ఛార్జీ రూ.60 ఉంది. ఈ నేపథ్యంలో ఎంతమేర పెంచాలనే విషయంపై సంస్థ త్వరలోనే ఓ ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.