Marri Rajasekhar : త్వరలో టీడీపీలో చేరతా : మర్రి రాజశేఖర్

Marri Rajasekhar : త్వరలోనే టీడీపీలో చేరతానని ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన మర్రి రాజశేఖర్ సంచలన ప్రకటన చేశారు. ఇవాళ గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైసీపీ అధినేత జగన్ వైఖరి, మోసం వల్లే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌లో ఉన్న తాను 2011లో వైసీపీలో చేరినట్లు చెప్పారు. 14 ఏళ్లు ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ బలోపేతానికి కృషి చేననట్లు తెలిపారు. 2019 ఎన్నికల్లో విజయం ఖాయం అనుకుంటున్న వేళ మరో వ్యక్తిని తీసుకొచ్చి నిలబెట్టారన్నారు. పార్టీ అధికారంలోకి వస్తే తనకు ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇస్తానని జగన్ బహిరంగంగా హామీ ఇచ్చారని, కార్యకర్తలు, అభిమానులు పార్టీ విజయం కోసం పనిచేశారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మాట తప్పి వేరే వారికి మంత్రి పదవి ఇచ్చారని ఆరోపించారు. ప్రతి ఎమ్మెల్సీ ఎన్నికల వేళ మర్రి రాజశేఖర్‌కు పదవి అంటూ మోసం చేశారని మండిపడ్డారు. పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన తనకు కనీస గౌరవం ఇవ్వలేదని ధ్వసమెత్తారు.
చిలకలూరిపేట నుంచి గెలిచిన వ్యక్తి 2024లో గుంటూరుకు వెళ్లారని, అప్పుడు కూడా నియోజకవర్గంలో తనను సంప్రదించకుండా వేరే వారిని నిలబెట్టారన్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత తిరిగి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారని, గుంటూరులో 53వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన వారికి తిరిగి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారని మండిపడ్డారు. నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి పనిచేసిన తనను, కార్యకర్తలను సంప్రదించలేదన్నారు. అందుకే వైసీపీకి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాతే పార్టీ మారుతున్నట్లు చెప్పారు. ఆత్మగౌరవం కోసమే వైసీపీని వీడుతున్నానని ప్రకటించారు. త్వరలో టీడీపీలో చేరతానని మర్రి తెలిపారు.