AP Deputy CM Pawan Kalyan: రోడ్లకు నిధులు కోరితే 24 గంటల్లో సీఎం మంజూరు చేశారు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్!

AP Deputy CM Pawan Kalyan Launched “Adavitalli Bata” Program: అడవి తల్లిని నమ్ముకుంటే మనకు బువ్వ పెడుతుందని, నీడనిస్తుందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడలో ‘అడవితల్లి బాట’ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. పలు ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డుంబ్రిగుడలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.
రోడ్ల నిర్మాణానికి రూ.49 కోట్లు మంజూరు..
గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి నిధులు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరితే 24 గంటల్లో రూ.49 కోట్లు మంజూరు చేశారని కొనియాడారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. అడవి, ప్రకృతిపై తనకు అపారమైన ప్రేమ, గౌరవం ఉన్నాయని స్పష్టం చేశారు. అరకు అద్భుతమైన ప్రాంతం అన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. మన్యం ప్రాంతాల్లో సరైన రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని, గిరిజన ప్రజల జీవనశైలి మెరుగుపర్చాలన్నారు. ఈ ప్రాంతంలో రోడ్లు బాగుండాలని సూచించారు.
గత వైసీపీ ప్రభుత్వం రోడ్లకు రూ.92 కోట్లు ఖర్చు..
గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రోడ్లకు రూ.92 కోట్లే ఖర్చు చేసిందని పవన్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాదిలో రూ.1,500 కోట్ల విలువైన పనులను మంజూరు చేశామని చెప్పారు. టెండర్లు పిలిచామన్నారు. వారంరోజుల్లో పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ ప్రాంతంలో కూటమి పార్టీకి ఓట్లు పడకపోయినా మీ బాగోగులు చూడటానికి తాము ఉన్నామన్నారు. ప్రభుత్వాలు, పార్టీలు మారుతుంటాయని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా అభివృద్ధి జరగాలని పవన్ ఆకాంక్షించారు. అంతకుముందు పెదపాడు గ్రామంలో గిరిజనులతో పవన్ సమావేశమయ్యారు. చాపురాయి ప్రాంతాన్ని దాటుకుంటూ గిరిశిఖర గ్రామానికి వెళ్లారు. అక్కడి ప్రజలతో గంటసేపు మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. స్థానిక సమస్యలను 6 నెలల్లో పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.