Sit notices: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. వైసీపీ ఎంపీ రఘురామరాజుకు తెలంగాణ సిట్ నోటీసులు
తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రత్యేక దర్యాప్తు టీమ్ విచారణ కొనసాగుతోంది. తాజాగా ఈ వ్యవహారంలో ఏపీకి చెందిన వైఎస్ఆర్ సీపీ ఎంపీ రఘురామ కృష్ణ రాజుకు సిట్ నోటీసులు జారీ చేసింది.
Telangana News: తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రత్యేక దర్యాప్తు టీమ్ విచారణ కొనసాగుతోంది. తాజాగా ఈ వ్యవహారంలో ఏపీకి చెందిన వైఎస్ఆర్ సీపీ ఎంపీ రఘురామ కృష్ణ రాజుకు సిట్ నోటీసులు జారీ చేసింది. విచారణకు రావాలని ఆదేశించింది. తాము 41ఏ సీఆర్‌పీసీ కింద నవంబరు 29న విచారణకు హాజరు కావాలని నోటీసులో తెలియజేసారు .ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో అరెస్టైన నిందితులతో పరిచయాలున్నాయనే రఘురామకృష్ణంరాజుకి సిట్ నోటీసులు జారీ చేసిందని సమాచారం. ఈ కేసును సిట్ విచారిస్తుంది.
గత నెల 26న మొయినాబాద్ ఫాం హౌస్ లో ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని రామచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి , పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, తాండూరు ఎమ్మెల్యేల పైలెట్ రోహిత్ రెడ్డిలను పార్టీ మారాలని ప్రలోభపెట్టారని ఈ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యేల ప్రలోభాల వెనుక బీజేపీ ఉందని టీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కానీ ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది.ఈ కేసును విచారించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ ఇప్పటికే పలువురిని విచారించింది. బీఎల్ సంతోష్ , తుషార్, జగ్గుస్వామిలకు కూడా సిట్ నోటీసులు జారీ చేసింది.
మరోవైపు ఈ అంశంపై ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. సిట్ తనకు నోటీసులు ఇవ్వలేదని చెప్పారు. మీడియాలో నోటీసులు అందాయని వస్తోందని, కానీ, తనకు ఎలాంటి నోటీసులు అందలేదని వివరించారు. తాను ఢిల్లీలో ఉన్నానని అన్నారు. హైదరాబాద్ ఇంటి వద్ద కూడా నిన్న సాయంత్రం వరకూ ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని తెలిపారు. ఒకవేళ 41ఏ కింద నోటీసులు ఇస్తే ఏం చేయాలో కూడా తనకు తెలుసని అన్నారు.