White House : వైట్‌హౌస్ సమీపంలో కాల్పులు.. అసలు ఏమి జరిగిందంటే..

White House : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ సమీపంలో కాల్పులు జరిగాయి. ఓ అనుమానితుడిపై అగ్రరాజ్యం సీక్రెట్ సర్వీస్ బృందం కాల్పులు జరిపింది. అగ్రరాజ్యం అమెరికా కాలమాన ప్రకారం ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి జరిగింది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
అమెరికాలోని ఇండియానా రాష్ట్రం నుంచి వాషింగ్టన్‌కు వస్తున్న ఓ వ్యక్తి కదలికలను పోలీసులు గుర్తించారు. అతడు వైట్‌హౌస్ సమీపంలో ఉన్నట్లు సీక్రెట్ సర్వీస్‌కు సమాచారం అందగా, వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. అమెరికా అధ్యక్ష భవనానికి కొంత దూరంలో పార్కింగ్ చేసిన ఓ వాహనాన్ని గుర్తించారు. సమీపంలో ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తాడు. ఈ క్రమంలో అతని వద్దకు చేరుకునేందుకు ప్రయత్నించారు. అధికారులు వస్తున్నట్లు గమనించిన అతడు వెంటనే తన వద్ద ఉన్న తుపాకీ బయటకు తీశాడు. అనుమానితుడిని అదుపులోకి తీసుకునేందుకు యత్నిస్తుండగా వారి మధ్య ఘర్షణ జరిగింది.
నిందితుడు కాల్పులు జరిపేందుకు యత్నిస్తుండగా, సిబ్బంది కూడా అతడిపై కాల్పులకు పాల్పపడ్డారు. ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫ్లోరిడాలో ఉన్నారు. ఈ ఘటనలో అనుమానితుడి గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని, వారంతా సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం అతడి పరిస్థితి ఎలా ఉందనే విషయం మాత్రం వెల్లడించలేదు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.