Last Updated:

Canada snap elections: కెనడాలో ముందస్తు ఎన్నికలు..లిబరల్‌ పార్టీకి మెజార్టీ దక్కే అవకాశం!

Canada snap elections: కెనడాలో ముందస్తు ఎన్నికలు..లిబరల్‌ పార్టీకి మెజార్టీ దక్కే అవకాశం!

Canada Prime Minister Mark Carney calls snap election on April 28: కెనడా కొత్త ప్రధాని మార్క్‌ కార్నీ హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏప్రిల్‌ 28న కెనడాలో ఎన్నికలు జరగనున్నాయి. కాగా పోల్‌ ట్రాకర్స్‌ మాత్రం అధికార లిబరల్‌ పార్టీకి 48 శాతం మెజారిటీ దక్కే అవకాశం ఉందని తేల్చి చెప్పాయి. ఇక మిగిలిన పెద్ద పార్టీలు లిబరల్స్‌, కన్సర్వేటివ్స్‌, న్యూ డెమోక్రాటిక్స్‌, బ్లాక్-క్యూబెకోయిస్ & గ్రీన్స్ పార్టీలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.

కాగా, కెనడాలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో అధికారం నుంచి దిగిపోయిన తర్వాత ప్రధానమంత్రిగా మార్క్‌ కార్నికి బాధ్యతలు అప్పగించారు. ఆయన వెంటనే హౌస్‌ కామన్స్‌ లేదా పార్లమెంటును రద్దు చేసి వెంటనే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. గవర్నర్‌ జనరల్‌ మారి సైమన్‌ను కలిసి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి ఆమె కూడా తక్షణమే అంగీకరించారు. దీంతో కెనడాలో వచ్చే నెల అంటే ఏప్రిల్‌ 28న ఎన్నికలు జరగనున్నాయి.

గతంలో ఎన్నడూ ఎదుర్కొని సంక్షోభాన్ని ప్రస్తుతం కెనడా ఎదుర్కొంటొందన్నారు. ఒక వైపు ట్రంప్‌ తమపై వాణిజ్య యుద్ధాన్ని ప్రకటించారు. మరో పక్క తమ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని మీడియా సమావేశంలో వాపోయారు. కాగా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ కెనడా అసలు దేశమే కాదు అంటున్నారు. కెనడాను ముక్క చెక్కలు చేసి అమరికాలో విలీనం చేసుకోవాలనుకుంటున్నాడు. అలాంటివి తాము ఎన్నటికి జరగనివ్వమన్నారు కార్ని. ట్రంప్‌ ఇచ్చిన షాక్‌ నుంచి ఇంకా కోలుకోలేదు. ట్రంప్‌నకు ఎలా గుణపాఠం చెప్పాలో చెప్పి చూపిస్తామన్నారు కార్నీ.

ఇక కార్ని విషయానికి వస్తే ఈ నెల 14న ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది జనవరిలో జస్టిన్‌ ట్రూడో రాజీనామా చేసిన తర్వాత కార్నీకి అవకాశం దక్కింది. ఆయన రెండు నెలల్లోపే ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారు. మాజీ సెంట్రల్‌ బ్యాంకు గవర్నర్‌గా పనిచేసిన కార్నీ ప్రస్తుతం ప్రజల్లో లిబరల్‌పార్టీకి అనుకూలంగా గాలి వీస్తోందని తెలుసుకొని… దాన్ని తనకు అనుకూలంగా మలచుకోవాలని ముందుస్తు ఎన్నికలకు వెళ్లాలనుకున్నారు. ఇక అమెరికాలో ట్రంప్‌ ఈ ఏడాది జనవరిలో పగ్గాలు చేపట్టినప్పటి నుంచి కెనడాను అమెరికాలో విలీనం కావాలని ఒత్తిడి పెంచుతున్నారు. 51వ రాష్ట్రంగా చేర్చుకోవాలని చూస్తున్నాడన్న వార్తలు కెనడాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ట్రంప్‌ ప్రతిపాదనను జస్టిన్‌ ట్రూడో వ్యతిరేకించారు… కార్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇక కెనడాలో ట్రూడో రాజీనామా చేసిన తర్వాత లిబరల్‌ పార్టీ రేటింగ్‌ బాగాపడిపోయింది. కెనడాలో 2015 నుంచి లిబరల్‌ పార్టీ అధికారంలో ఉంది. ఒపినీయన్‌ పోల్‌లో కన్సర్వేటివ్స్‌కు లిబరల్స్‌కు 20 శాతం గ్యాప్‌ ఉందని తేలింది.

అలాగే జస్టిన్‌ ట్రూడ్‌ నాయకత్వంలో లిబరల్‌ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది. దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా క్షీణించింది. ద్రవ్యోల్బణంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా పనిచేయలేదు. ఇమ్మిగ్రేషన్‌ను కంట్రోల్‌ చేయడానికి .. ఇతర దేశాల నుంచి వలసలను నిలువరించడానికి చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దీంతో ప్రజల్లో లిబరల్‌ పార్టీ రేటింగ్‌ భారీగా తగ్గిపోయింది. కన్సర్వేటివ్‌ల రేటింగ్‌ పెరిగింది. అయితే ట్రంప్‌ కెనడాపై టారఫ్‌ వార్‌ ప్రకటించిన తర్వాత నుంచి లిబరల్‌ పార్టీ రేటింగ్‌క్రమంగా మెరుగుపడింది. ప్రస్తుతం కెనడా ప్రజల్లో 37.5 శాతం లిబరల్స్‌కు మద్దతు ప్రకటిస్తున్నారని పోల్‌ట్రాకడ్స్‌ డేటాను సీబీసీ న్యూస్‌ ప్రచురించింది. ప్రస్తుతం అధికార లిబరల్‌ పార్టీ కన్సర్వేటివ్‌ల కంటే 37.1 శాతంతో లీడింగ్‌లో ఉంది. న్యూ డెమోక్రాటిక్‌ పార్టీ లేదా ఎన్‌డీపీ చీఫ్‌ జగ్మీత్‌ సింగ్‌కు 11.6 శాతం ఓట్లతో మూడవ స్థానంలో నిలిచారు.

అయితే పోల్‌ ట్రాకర్‌ మాత్రం లిబరల్‌ పార్టీ 48 శాతం మెజారిటీతో గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇటీవల ఐదు ప్రధానపార్టీకి చెందిన లీడర్లు లిబరల్స్‌, కన్సర్వేటివ్స్‌, న్యూ డెమోక్రాటిక్స్‌, బ్లాక్-క్యూబెకోయిస్ & గ్రీన్స్ తదితర పార్టీలు ఓటర్లను తమకే ఓటు వేయాలని విన్నవించుకున్నారు. ప్రస్తుతం కెనడాలో ముందస్తు ఎన్నికలు జరగడానికి ప్రధాన కారణం ట్రంప్‌. రెండు దేశాల మధ్య సరిహద్దు కృత్రిమంగా సృష్టించిందే అని.. అమెరికాలో 51వ రాష్ట్రంగా కెనడా విలీనం కావాలని ట్రంప్‌ తరచూ బెదరింపులకు పాల్పడడంతో కెనడా రాజకీయ నాయకులు తక్షణమే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కెనడాకు కాబోయే కొత్త ప్రధాని ట్రంప్‌తో అమీతుమీ తేల్చుకోవాలనేదే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ప్రస్తుతం పోటీ లిబరల్స్‌. కన్సర్వెటివ్‌ల మధ్య నువ్వా నేనా అన్నట్లు జరుగుతోంది. ఆదివారం నాడు జరిగిన మీటింగ్‌లో అన్నీ రాజకీయ పార్టీల నాయకులు తమ ప్రసంగంలో ప్రధానంగా ట్రంప్‌ చేసిన కామెంట్లపైనే మాట్లాడారు.

ఇదిలా ఉండగా, ప్రధాని కార్ని మాత్రం ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో అందరం కలిసి కట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. అదే సమయంలో కన్సర్వేటివ్‌ చీఫ్‌ పోయిలివ్రేపై ధ్వజమెత్తారు. ఇలాంటి పరిస్థితుల్లో కోపాలు తాపాలతో సమస్య పరిష్కారం కాదన్నారు. కాగా పోయిలివ్రే మాత్రం వాషింగ్టన్‌తో చర్చలు జరపాలని పట్టుబట్టారు. ప్రస్తుతం అందరి దృష్టి ఏప్రిల్‌ 2వ తేదీపై పడింది. ఆ రోజు ట్రంప్‌ కొత్తగా టారిఫ్‌ను పెంచుతామని ప్రకటించారు. ప్రస్తుతం కెనడా నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై అమెరికా 25 శాతం పన్ను విధిస్తోంది. కెనడా నుంచి స్టీల్‌, అల్యూమినియం దిగుమతి చేసుకుంటోంది అమెరికా. కాగా కెనడా ఆటోమొబైల్‌ రంగంతో పాటు టింబర్‌ సెక్టార్‌ పై తరచూ తన ప్రసంగాల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు ట్రంప్‌. తమ దేశం నుంచి జరిగే ఎగుమతులపై పెద్ద ఎత్తున పన్ను విదిస్తున్నారని ఆయన మండిపడుతుంటారు. ఇక మాజీ ప్రధాని ట్రూడో విషయానికి వస్తే ఆయన ప్రజాదరణ దారుణంగా పడిపోయింది. అయితే ట్రంప్‌ టారిఫ్‌కు దీటుగా తాను టారిఫ్‌ పెంచుతానని ప్రకటించిన వెంటనే ఆయనకు ప్రజల్లో మద్దతు పెరిగింది.