Donald Trump on Russias strikes on Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా దాడి.. తీవ్రంగా ఖండించిన డొనాల్డ్ ట్రంప్!

Donald Trump Sensational Comments Russia Strike on Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడింది. సుమీ నగరంపై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించగా.. 34 మంది మృతి చెందారు. ఈ దాడిలో 117 మంది క్షతగాత్రులయ్యారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించాడు. ఉక్రెయిన్‌పై దాడి భయంకరమైంది అని, ఇలా యుద్ధం చేయడమే ఒక భయంకరమైన విషయమన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తప్పు చేస్తున్నాడని అన్నారు. ఇప్పటికే ఆయనకు చెప్పినప్పటికీ ఇలా మళ్లీ దాడులు చేయడం మరింత దారుణమని వెల్లడించారు.
ఇదిలా ఉండగా, ఉక్రెయిన్ దేశాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సందర్శించాలని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ కోరారు. రష్యా తమ దేశంపై చేసిన విధ్వంసాన్ని తప్పకుండా చూడాలన్నారు. యుద్ధం కారణంగా తమ దేశంలో నెలకొన్న పరిస్థితులు, మరణించిన వ్యక్తులను చూడాలన్నారు. అలాగే వేల సంఖ్యలో దెబ్బతిన్న భవనాలను చూసిన అనంతరం ఏదైనా నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. కాగా, అంతకుముందు ఇద్దరి మధ్య జరిగిన చర్చలు వాగ్వాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే.