Israeli Hostages : దాడులు ఆపాలని హమాస్ హెచ్చరిక

Israeli Hostages : ఇజ్రాయెల్ తన దాడులను పునఃప్రారంభించింది. దీంతో గాజా మళ్లీ నెత్తురోడుతోంది. భీకర దాడుల్లో ఇప్పటికే వందలాది మంది మృతిచెందారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌కు హమాస్ తీవ్ర హెచ్చరికలు చేసింది. దాడులను కొనసాగిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరింది. లేకపోతే సైన్యం సాయంతో బందీలను తరలించేందుకు యత్నిస్తే వారు శవపేటికల్లో తిరిగొస్తారని తెలిపింది. మరోవైపు గాజాలోని కొన్ని ప్రాంతాలను ఖాళీ చేయాలంటూ స్థానికులకు ఐడీఎఫ్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం..
బందీలను సజీవంగా ఉంచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని హమాస్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇజ్రాయెల్ చేపడుతున్న దాడులు వారి ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నాయని, సైన్యం సాయంతో బందీలను విడిపించుకోవాలని ప్రయత్నిస్తే వారు శవపేటికల్లో తిరిగివస్తారని పేర్కొంది. మరోవైపు గాజాపై టెల్‌అవీవ్ తన దాడులను విస్తృతం చేస్తోంది. గాజాలోని జీటౌన్, టెల్ అల్-హవా తదితర ప్రాంతాల పౌరులు తమ నివాసాలను ఖాళీ చేయాలని ఆదేశించింది. ఈ ప్రదేశాల నుంచి ఉగ్రమూకలు చేపట్టిన రాకెట్ దాడులకు ప్రతీకారంగా త్వరలో సమాధానం చెబుతామని తెలిపింది.
హమాస్‌పై సైనికపరంగా ఒత్తిడి పెంచుతాం..
మిగిలిన 59 మంది బందీలను అప్పగించేవరకు హమాస్‌పై సైనికపరంగా ఒత్తిడి పెంచుతామని నెతన్యాహు సర్కారు ఇప్పటికే స్పష్టం చేసింది. శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందం కుదిరేవరకూ గాజా నుంచి ఇజ్రాయెల్ పూర్తిగా వైదొలిగేవరకు బందీలను విడుదల చేయబోమని హమాస్ చెబుతోంది. ఇటీవల ఇజ్రాయెల్ మరోసారి ప్రారంభించిన దాడుల్లో దాదాపు 830 మంది మృతి చెందారు. దీంతో హమాస్‌కు వ్యతిరేకంగా స్థానికంగా ఆందోళనలు వెల్లువెత్తడం గమనార్హం.