Vladimir Putin : త్వరలో భారత్‌కు రానున్న రష్యా అధ్యక్షుడు పుతిన్

Vladimir Putin : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. గతేడాది ప్రధాని మోదీ మాస్కో పర్యటన సందర్భంగా భారత్‌లో పర్యటించాలని పుతిన్‌ను ఆహ్వానించారు. ఈ మేరకు ఇండియా పర్యటన ఖరారైనట్లు రష్యా వర్గాలు ధ్రువీకరించాయి. 2022లో ఉక్రెయిన్ భీకర యుద్ధం మొదలైన తర్వాత పుతిన్ చేస్తున్న తొలి పర్యటన ఇదే. పుతిన్ భారత్ పర్యటనకు సన్నాహాలు జరుగుతున్నాయని, ఇప్పటి వరకు తేదీలు ఖరారు కాలేదని రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ తెలిపారు. అధ్యక్షుడు పుతిన్ భారత ప్రభుత్వాధినేత నుంచి వచ్చిన ఆహ్వానాన్ని అంగీకరించారని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ మూడోసారి తిరిగి ఎన్నికైన తర్వాత తన తొలి పర్యటనకు రష్యాను ఎంచుకున్నారు. ఇక ఇప్పుడు తమ వంతు వచ్చిందని లావ్రోవ్ వెల్లడించారు.
భౌగోళిక రాజకీయ సంక్షోభంపై చర్చించే అవకాశం..
అగ్రరాజ్యం అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉక్రెయిన్ యుద్ధంపై తీసుకున్న వైఖరి, భౌగోళిక రాజకీయ సంక్షోభంపై ఇరుదేశాల నేతలు చర్చించే అవకాశం ఉంది. ఉక్రెయిన్ వివాదంపై ఇండియా ఇప్పటి వరకు తటస్థ వైఖరిని కొనసాగిస్తూ వస్తోంది. ఇది యుద్ధం చేయాల్సిన యుగం కాదని పుతిన్‌కు ప్రధాని మోదీ పదేపదే చెప్పారు. రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి ఆమోదించిన తీర్మానాలకు ఇండియా కూడా దూరంగా ఉంది. పుతిన్‌ను బహిరంగంగా విమర్శించడం మానేశారు. 2024లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని కలవడానికి మాస్కో, కైవ్ రెండింటినీ సందర్శించిన అతి కొద్ది మంది నాయకుల్లో ప్రధాని మోదీ ఒకరు. బ్రిక్స్ సమ్మిట్ కోసం అక్టోబర్‌లో మోదీ రష్యాలోని కజాన్‌కు వెళ్లారు.
ఇద్దరు మధ్య సాన్నిహిత్యం..
22వ రష్యా-భారత్ శిఖరాగ్ర సమావేశానికి మాస్కో వెళ్లిన సందర్భంగా ప్రధాని మోదీ, పుతిన్ మధ్య ఉన్న సాన్నిహిత్యం అందరి దృష్టిని ఆకర్షించింది. మోదీ, పుతిన్ ఛాయ్ తాగుతూ ముచ్చటించిన వీడియోలు, గోల్ఫ్ కార్ట్‌లో తన నివాసాన్నిచూపిస్తూ ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పర్యటన సందర్భంగా ఇరు దేశాలు తమ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు చేర్చాలని అంగీకరించాయి.