CM Revanth Reddy: హైదరాబాద్‌లో ఫోర్త్, ఫ్యూచర్ సిటీ నిర్మిస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy Comments on Hyderabad Fourth City: హైదరాబాద్‌లో ఫోర్త్, ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైటెక్ సిటీలోని సీఐఐ నేషనల్ కౌన్సిల్ మీటింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్కిల్స్, ఉద్యోగాల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించామని చెప్పారు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల్లో తెలంగాణనే నెంబర్ వన్ వచ్చేందుకు కృషి చేస్తామన్నారు.
మూసీలో 55 కి.మీ వరకు తాగునీరు అందేలా చూస్తామని సీఎం పేర్కొన్నారు. రీజినల్ రింగ్ రోడ్ ప్రణాళిక దశలో ఉందన్నారు. దాదాపు 360 కి.మీల పొడవు రీజినల్ రింగ్ రోడ్ నిర్మిస్తున్నామని, ఓఆర్ఆర్ చుట్టూ రీజినల్ రింగ్ రైల్వేను ప్లాన్ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం పారిశ్రామికవేత్తలకు సీఎం ఆహ్వానం పంపారు. పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో కలిసి వస్తే అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. ఫోర్త్ సిటీని నిర్మిస్తామని, ఇది ఇతర దేశాల్లోని నగరాలతో పోటీ పడుతుందని వివరించారు.
అదే విధంగా, ఆర్టీసీలోకి 3,200 ఈవీ బస్సులను తీసుకొస్తున్నామని, ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్, రోడ్డు పన్నును తొలగించామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అలాగే ప్రకృతి వైపరిత్యాలను సైతం ఎదుర్కొనేలా నగరాన్ని మారుస్తామని, ఫ్యూచర్లో హైదరాబాద్‌ను వరదలు లేని నగరంగా తీర్చిదిద్దుతామని సీఎం తెలిపారు.