Last Updated:

KTR: ఈడీ, మోడీలకు భయపడం.. ప్రభుత్వానివన్నీ కాకి లెక్కలే

KTR: ఈడీ, మోడీలకు భయపడం.. ప్రభుత్వానివన్నీ కాకి లెక్కలే

BRS Working President KTR Criticized CM Revanth Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని బెదిరింపులు చేసినా భయపడేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.  ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయటం చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం విపక్షాలను బెదిరించే పనికి దిగుతోందని, తాను ఈడీ, మోడీకి భయపడబోనని వ్యాఖ్యానించారు. నేటికీ 100 శాతం రైతు రుణమాఫీ అమలు కాలేదని ఆరోపించారు. ప్రభుత్వం కాకి లెక్కలు చెబుతున్నదని మండిపడ్డారు.

అదంతా తప్పుడు ప్రచారం..
ప్రభుత్వం రైతు భరోసా ఎగ్గొట్టి తప్పుడు ప్రచారం చేస్తోందని కేటీఆర్ ఫైర్ అయ్యారు. తాము తీసుకొచ్చిన రైతుబంధు వల్ల ఎంతో మంది రైతులు బాగుపడ్డారని, తమ హయాంలో రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు తగ్గిపోయాయని చెప్పారు. శాసనసభ చరిత్రలో ఎప్పుడూ చెప్పని విధంగా ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పారని, ఆయన మాటలను తాము నమ్మబోమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రూ.26,775 కోట్లు రైతుభరోసా సాయం అందించాల్సి ఉందని, చూడబోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వకుండా ఉండేందుకు ఎత్తులు వేస్తున్నట్లు అనుమానంగా ఉందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతులంతా కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పాలని కోరారు. పత్తి, కంది రైతులంతా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను గమనించి బుద్ది చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

పిల్లి శాపాలకు ఉట్లు తెగవు..
బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న కార్యక్రమాలు చూసి సీఎంకు భయం పట్టుకుందని, ఆయనకు నిద్ర కూడా పడుతున్నట్లు లేదని కేటీఆర్ సెటైర్ వేశారు. ఇకనైనా, కనిపించిన వారినందరినీ తిడుతున్న రేవంత్‌రెడ్డిని ఇకనైనా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకుపోవాలని సూచించారు. సీఎం అబద్ధాలను ప్రజలు నమ్మడం లేదని, ఎన్ని కేసులు పెట్టినా, ఎంత తిట్టినా ప్రజలు మళ్లీ కాంగ్రెస్‌కు ఓటేయరని వ్యాఖ్యానించారు. పిల్లి శాపాలకు ఉట్లు తెగవని, కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు అమలయ్యే వరకు తాము ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.