Last Updated:

Bhu Bharati Bill: భూభారతి చట్టానికి గవర్నర్ ఆమోదం..త్వరలోనే అమల్లోకి!

Bhu Bharati Bill: భూభారతి చట్టానికి గవర్నర్ ఆమోదం..త్వరలోనే అమల్లోకి!

Telangana Governor Green Signal To Telangana Bhubharathi Bill: చరిత్రాత్మ‌క‌మైన‌ భూ భారతి చ‌ట్టాన్ని గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ ఆమోదించిన నేప‌ధ్యంలో, త్వరలో దీనిని అమలుకు రంగం సిద్ధం చేస్తామని రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో మెరుగైన‌, స‌మ‌గ్ర‌మైన రెవెన్యూ సేవ‌లను స‌త్వ‌ర‌మే అందించాల‌న్న ఆశ‌యంతో భూభార‌తి చ‌ట్టాన్ని తీసుకొచ్చామని, దీంతో భూతగాదాలకు చెక్ పడుతుందని తెలిపారు.

గ్రామానికో రెవెన్యూ ఉద్యోగి..
గత సర్కారు తెచ్చిన రెవెన్యూ చ‌ట్టం -2020 వ‌ల్ల సామాన్య ప్ర‌జ‌లు, రైతులు అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కోన్నారని, దీంతో భూ స‌మ‌స్య‌లేని గ్రామం లేకుండా పోయిందన్నారు. గత పదేళ్లలో రెవెన్యూ వ్య‌వ‌స్ద‌ను పూర్తిగా చిన్నాభిన్నం అయిందని తెలిపారు. గత ప్రభుత్వంలో కొందరి గుప్పిట్లోనే భూరికార్డులున్నాయని, అందుకే దానికి ప్రత్యామ్నాయంగా కొత్త చట్టం తెచ్చామన్నారు. ఇక గ్రామాల్లో రెవెన్యూ పాల‌న‌ చూసేందుకు ప్ర‌తి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించ‌నున్నట్లు క‌స‌రత్తు కొలిక్కివ‌చ్చిందన్నారు.

అందరి ఆమోదంతోనే..
ప్ర‌జ‌లంద‌రి అభిప్రాయాల‌ను క్రోడీకరించి సామాన్యుల సంక్షేమ‌మే ధ్యేయంగా భూభార‌తి చ‌ట్టాన్ని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ చ‌ట్టం విధి విధానాల‌ను రూపొందించ‌డంపై ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని అధికారుల‌కు సూచించారు. కాగా, ప్రజల భూమి హక్కుల రికార్డుల సమస్యల పరిష్కారంలో ఇదో కీలక ఘట్టమని, ఈ ప్రయాణంలో భాగస్వామిని అయినందుకు సంతోషంగా ఉందని మంత్రి చెప్పారు.