Last Updated:

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. ఇక రాజీపడేది లేదు

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. ఇక రాజీపడేది లేదు

TFI Meets Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇటీవల పుష్ప-2 సినిమా బెనిపిట్ షో సందర్బంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై గురువారం ఉదయం తెలంగాణ ప్రభుత్వంతో దిల్ రాజ్ నేతృత్వంలోని సినీ ప్రముఖుల బృందం సమావేశమైంది. ఇటీవల జరిగిన పరిణామాలు, టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలు ఇతర అంశాలపై సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. ఈ భేటీలో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో మహిళ ప్రాణాలు కోల్పోయిన అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిపారు.

ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, హోంశాఖ సెక్రటరీ, డీజీపీ, చిక్కడపల్లి సీఐతో పాటు సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతలు, దర్శకులు, హీరోలు హాజరయ్యారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. సినీ పరిశ్రమకు అండగా ఉంటామనే ఇండస్ట్రీ పెద్దలకు సీఎం రేవంత్ క్లియర్ మెసేజ్ ఇచ్చారు. శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం రాజీపడేది లేదన్నారు. హీరోల ప్రభావం సమాజంపై అధికంగా ఉంటుందని, సొసైటీకి ప్రముఖుల ప్రవర్తన ఆదర్శంగా ఉండాలని సూచించారు.

అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. మాది ప్రజాప్రభుత్వమని, ఏడాది కాలంగా అంతా మా పరిపాలన గమినిస్తున్నారని ఆయన వెల్లడించారు. సినిమా పరిశ్రమ కూడా కలిసి రావాలని పిలుపునిచ్చారు. సినీ పరిశ్రమలో రాజకీయ జోక్యం ఉండొద్దని అన్నారు. తెలంగాణ రైజింగ్‌లా బిజినెస్ మోడల్‌ని తీసుకెళ్దామన్నారు.

అయితే ప్రభుత్వాన్ని కలిసే అవకాశం ఇచ్చినందుకు నిర్మాత అల్లు అరవింద్ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. సంధ్య థియేటర్ లాంటి ఘటన మరోసారి జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ షూటింగ్‌లకు బెస్ట్ స్పాట్ అని, ముంబై వాళ్లు సైతం ఎప్పుడూ చెబుతుంటారని అల్లు అరవింద్ అన్నారు. తెలుగు ప్రొడ్యూసర్లు శుభదినమన్నారు.

అలాగే సినిమా రిలీజ్‌లో కాంపిటిషన్ వల్లే ప్రమోషన్ కీలకంగా మారిందని నటుడు మురళీమోహన్ వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్ ఉండడంతో ప్రమోషన్‌ను విస్తృతంగా చేస్తున్నామని మురళీమోహన్ తెలిపారు. నేను చిన్పప్పటి నుంచి ఇండస్ట్రీని చూస్తున్నానని, హైదరాబాద్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాలని శ్యాంప్రసాద్ రెడ్డి అన్నారు.

యూనివర్సల్ లెవెల్‌లో స్టూడియో సెటప్ ఉండాలని సీనియర్ హీరో అక్కినేని నాగార్జున అన్నారు. ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్‌లు ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందని, హైదరాబాద్ వరల్డ్ సినిమా కేపిటల్ కావాలనేది మా కోరిక అని నాగార్జున పేర్కొన్నారు.