Last Updated:

Dil Raju: ప్రభుత్వం, చిత్రపరిశ్రమకు వారధిగా పనిచేస్తా.. టీఎఫ్‌డీసీ చైర్మన్‌గా దిల్‌రాజు బాధ్యతల స్వీకరణ

Dil Raju: ప్రభుత్వం, చిత్రపరిశ్రమకు వారధిగా పనిచేస్తా.. టీఎఫ్‌డీసీ చైర్మన్‌గా దిల్‌రాజు బాధ్యతల స్వీకరణ

Dil Raju assumes charge as chairman of TFDC: టాలీవుడ్‌ నిర్మాత దిల్‌ రాజుకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ ఫిల్మ్‌‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ (టీఎఫ్‌డీసీ) చైర్మన్‌గా దిల్‌రాజును నియమిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ వద్ద గల టీఎఫ్‌డీసీ కాంప్లెక్స్‌లోని కార్యాలయంలో నూతన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. రెండేళ్లపాటు ఆయన ఈ పదవీలో కొనసాగనున్నారు.

టీఎఫ్‌డీసీకి పూర్వవైభవానికి కృషి
పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం దిల్‌రాజు మీడియాతో మాట్లాడారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్‌‌రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు. టీఎఫ్‌డీసీకి పూర్వవైభవానికి అందరి సహకారం అవసరమన్నారు. తెలంగాణ సంస్కృతిని ఆధారంగా చేసుకొని సినిమాలు వచ్చేలా చూడాలన్నారు. మద్రాస్ నుంచి హైదరాబాద్‌ వచ్చిన తర్వాత తెలుగు సినీపరిశ్రమ ఎంతో అభివృద్ధి చెందిందని, ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా మరెంతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. టీఎఫ్‌డీసీ చైర్మన్‌గా నాపై ఎంతో బాధ్యత ఉందని, ప్రభుత్వానికి, చిత్ర పరిశ్రమకు మధ్య వారధిగా పనిచేస్తానని చెప్పారు. పరిశ్రమలోని అన్నివిభాగాల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని దిల్‌రాజు తెలిపారు.

సంక్రాంతికి గేమ్‌ ఛేంజర్‌ విడుదల..
కాగా, బుధవారం దిల్ రాజు పుట్టినరోజు కావడం మరో విశేషం. విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. ప్రస్తుతం ఆయన నిర్మించిన గేమ్‌ ఛేంజర్‌, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు వచ్చే ఏడాది పొంగల్‌కు విడుదల కానున్నాయి. నితిన్‌ హీరోగా నటిస్తున్న తమ్ముడు చిత్రానికి కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.