Waqf Bill 2024 : రేపు లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లు.. బీజేపీ ఎంపీలకు విప్ జారీ

Waqf Bill 2024 : కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా బావిస్తున్న వక్ఫ్ సవరణ బిల్లు రేపు పార్లమెంటు ముందుకు రాబోతోంది. బిల్లుకు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఉభయ సభల ఆమోదం లభించేలా అధికార పార్టీ పట్టుదలగా ఉంది. పలు కారణాలతో విపక్షాలు విభేదిస్తున్న క్రమంలో బిల్లును రేపు లోక్‌సభలో ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. స్పీకర్ దీనిపై చర్చకు 8 గంటలు కేటాయించాలని నిర్ణయించారు. అనంతరం ఓటింగ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీలకు అధిష్ఠానం మూడులైన్ల విప్ జారీ చేసింది. ఎంపీలు బుధవారం తప్పనిసరిగా సభకు హాజరుకావాలని, రోజంతా ఉండాలని బీజేపీ కోరింది.
బీఏసీ సమావేశానికి బీజేపీ పిలుపు..
వక్ఫ్ బిల్లుపై చర్చా సమయం, పార్టీలకు సంఖ్యాబలం ఆధారంగా సమయం కేటాయింపుపై చర్చించేందుకు బీఏసీ సమావేశానికి బీజేపీ మంగళవారం పిలుపునిచ్చారు. బిల్లుపై చర్చకు 8 గంటలు కేటాయించాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. 12 గంటల సమయం కావాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. దీనిపై తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో సమావేశం నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి.
పొడిగించే అవకాశం ఉంది : రిజిజు
వక్ఫ్ సవరణ బిల్లు-2024ను రేపు ప్రశ్నోత్తరాల సమయం అనంతరం లోక్‌సభలో ప్రవేశపెడతారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. దీనిపై 8 గంటలు చర్చ జరపాలని బీఏసీ సమావేశం నిర్ణయించిందని చెప్పారు. అవసరాన్ని బట్టి సమయం పొడిగించే వీలుందని తెలిపారు. సభలో చర్చను తాము కోరుకుంటున్నామని, ప్రతి రాజకీయ పార్టీకి తమ అభిప్రాయాన్ని చెప్పే హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. సవరణ బిల్లుపై ఏ పార్టీ ఎలాంటి వైఖరి తీసుకుందో ప్రజలు కూడా తెలుసుకోవాలని అనుకుంటారని చెప్పారు.