Last Updated:

Prashant Kishor: బీహార్ ఎన్నికల్లో సర్‌ప్రైజ్ తప్పదు.. ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు

Prashant Kishor: బీహార్ ఎన్నికల్లో సర్‌ప్రైజ్ తప్పదు.. ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు

Prashant Kishor About Bihar Poll Prediction: రాబోయే బీహార్ ఎన్నికల్లో సర్‌ప్రైజ్ తప్పదని జన్ సూరజ్ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. అయితే ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం గెలిచినా లేదా ఓడినా నితీశ్ కుమార్ మాత్రం సీఎంగా కొనసాగరని వెల్లడించారు. ఇప్పటివరకు నితీశ్ రాజకీయాల్లో రాణించారని, ఇకపై ఆ అవకాశాలు తక్కువేనని ప్రశాంత్ కిశోర్ అభిప్రాయపడ్డారు.

రెస్ట్ మోడ్‌లో నితీశ్..
సీఎం నితీశ్ కుమార్ శారీరకంగానే గాక మానసికంగానూ బాగా అలసి పోయారని, ఆయన ఇప్పటికే రిటైర్ అయిపోయినట్లుగా కనిపిస్తున్నారని ప్రశాంత్ కిశోర్ అన్నారు. ముఖ్యమంత్రి నితీశ్.. గడగడా తన కేబినెట్ మంత్రులు, శాఖల పేర్లు కూడా చెప్పే స్థితిలో లేరని ఎద్దేవా చేశారు. కాబట్టి, ఈ ఏడాది చివరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఆయనకు వ్యతిరేక ఫలితాలు రాబోతున్నాయని అభిప్రాయపడ్డారు. బీహార్‌లోని ఎన్డీయే కూటమి బీజేపీ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉందని, ఆ ప్రభుత్వానికి నితీశ్ కుమార్ ప్రస్తుతం ఓ మాస్కులాగా ఉన్నారని పేర్కొన్నారు. బీహార్ ఎన్నికలను ఢిల్లీ, హర్యానా ఎన్నికలతో పోల్చలేమని, ఇక్కడి రాజకీయాలు, సమస్యలు వేరని అన్నారు.

ఈసారీ తిప్పలే..
కాగా, వచ్చే డిసెంబరులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ 100 సీట్ల కోసం పట్టుపట్టొచ్చని,అయితే ఈసారి బీజేపీ కూడా బుజ్జగింపు ధోరణిని వదిలేసే ఛాన్స్ ఎక్కువని అంచనావ వేశారు. ఒకవేళ.. 2025 డిసెంబరు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలిచినా నితీశ్ కుమార్ మాత్రం ముఖ్యమంత్రిగా కొనసాగరని, ఈసారి బీజేపీ తన ముఖ్యమంత్రిని రంగంలోకి దింపుతుందని చెప్పుకొచ్చారు. అయితే, బీహార్ రాజకీయాలను తనంతట తానుగా శాసించే స్థితిలో ప్రస్తుతం బీజేపీ లేదని ప్రశాంత్ కిశోర్ అభిప్రాయపడ్డారు. అయితే బీహార్‌లో బీజేపీ ఒక్కసారి మాత్రమే 150 సీట్లల్లో పోటీ చేసిందని గుర్తు చేశారు.