Last Updated:

Maharishi Dayanand Saraswati Jayanti: వేద విజ్ఞాన ఖని.. దయానంద సరస్వతి

Maharishi Dayanand Saraswati Jayanti: వేద విజ్ఞాన ఖని.. దయానంద సరస్వతి

Maharishi Dayanand Saraswati Jayanti: అవిద్య, మూఢనమ్మకాలు, సామాజిక కట్టుబాట్ల చెరలో మగ్గిపోతున్న హైందవ జాతిని సత్యాన్వేషణ, సంస్కరణ వాదాల దిశగా నడిపించి శక్తివంతమైన భరత ఖండాన్ని నిర్మించేందుకు కృషిచేసిన తొలితరం సంస్కర్తలలో స్వామీ దయానంద సరస్వతి అగ్రగణ్యులు. గుజరాత్ రాష్ట్రంలోని కఠియావాడ్ ప్రాంతంలోని ఠంకారా గ్రామంలో 1824 ఫిబ్రవరి 12న ఒక సంప్రదాయ బ్రాహ్మణ దయానందులు జన్మించారు. శివభక్తులైన ఆ తల్లిదండ్రులు మూలా నక్షత్రంలో పుట్టిన ఆ శిశువుకు ‘మూలా శంకర్’అని పేరు పెట్టారు. తండ్రి కర్షణ్‌జీ పెద్ద భూస్వామి. దయానందునికి 5వ ఏట అక్షరాభ్యాసం చేయించారు. కేవలం 14 ఏళ్లలోపే ఆ బాలుడు యజుర్వేదాన్ని కంఠస్థం చేశారు. గొప్ప జ్ఞాపక శక్తి, మేధస్సు గల ఆ బాలుడిలో ప్రతి దానినీ తెలుసుకోవాలనే తపన, కుతూహలం కనిపించేవి. మూలా శంకరుడికి 14 ఏళ్ల వయసులో ఓసారి తల్లిదండ్రులు మహాశివరాత్రి రోజున శివాలయానికి తీసుకుపోయారు. రాత్రి 10 గంటల వేళ ఆలయానికి చేరిన ఊరిజనమంతా భజన చేస్తున్నారు. భజనలు తారస్థాయికి చేరుతుండగా.. జనంలో భక్తి పొంగిపొరలుతోంది. వారితో బాటు అక్కడ కూర్చున్న మూలా శంకరుడు మాత్రం గర్భాలయంలో దివ్యంగా అలంకరించిన శివలింగం వైపే తదేకంగా చూస్తుండిపోయాడు. ఇంతలో.. ఒక ఎలుక గర్భాలయంలోకి చొరబడి, నేరుగా శివలింగం మీద ఎక్కి కూర్చోవటం, చటుక్కున దిగి అక్కడి నైవేద్యాలు, పూలదండలను కొరికి, అక్కడి పాత్రలోని తీర్ధాన్ని ఎంగిలిచేయటం గమనించాడు. ‘ఇదేంటి.. లోకాలను కాపాడే శివుడి మీదికి ఒక చిట్టెలుక ఎలా ఎక్కింది? ఆయన తినాల్సిన ప్రసాదాన్ని ఆ అల్పజీవి ఎంగిలి చేసినా శివుడు శిక్షించడేమిటి?’అనుకున్నాడు. తండ్రిని ఆ మాటే అడగగా, ‘తప్పు. అలా అనకూడదు’అనే జవాబొచ్చింది. కానీ.. ఆ సంఘటన బాలుడిని సత్యాన్వేషణ దిశగా నడిపించింది.

మూలా శంకరుడికి 18 ఏళ్లు వచ్చే నాటికి చెల్లెలు కలరాతో కన్నుమూసింది. ‘మనిషి మరణాన్ని ఎందుకు జయించలేకపోతున్నాడు’ అనే దిశగా దయానందుల ఆలోచనలు సాగాయి. అదే సమయంలో దేవుడి పేరుతో జరుగుతున్న మోసాలూ.. ఆయన మనసును మెలిపెట్టాయి. దీంతో.. సాయలే నగరంలో బ్రహ్మచర్య దీక్ష తీసుకుని, ‘శుద్ధ చైతన్య బ్రహ్మచారి’గా కొన్నాళ్లు అక్కడే ఉండిపోయారు. ఇక.. ఇంటికి వెళ్లకూడదని నిర్ణయించుకుని మంచి గురువు కోసం వెదకసాగారు. బ్రహ్మచర్యం కంటే సన్యాసం శ్రేష్ఠమని భావించి పరమానంద సరస్వతి అనే గురువు వద్ద సన్యాసదీక్షను పొంది ‘దయానంద సరస్వతి’అనే యతినామాన్ని స్వీకరించారు. అనంతరం జ్వాలానందపురి, శివానందగిరి అనే యోగుల వద్ద యోగ పద్ధతులు నేర్చుకున్నారు. రుషీకేశ్‌ వెళ్లి సాధువులతో సత్సంగం చేశారు. అక్కడ అధ్యయనం చేసిన తంత్ర శాస్త్ర గ్రంథాల్లో మద్యం, మాంసం, మత్స్యం, ముద్రలు, మైథునం.. అనే పంచ మకారాలు అనుభవిస్తేనే మోక్షం ప్రాప్తిస్తుందని రాసి ఉండటంతో నివ్వెరబోయి, దుఃఖంతో అవి సరైనవి కావని వాటిని గంగానదిలోకి విసిరేశారు. వేదాలు, ఉపనిషత్తులు, కపిలుని సాంఖ్యశాస్త్రం, పతంజలి యోగశాస్త్రాలను ప్రమాణాలుగా భావించారు. సమాజం పట్ల అవగాహన కోసం గురువుల అనుమతితో దేశాటనకు బయలుదేరారు. ‘భిన్నాభిప్రాయల కారణంగా ఐకమత్యం సాధించలేక, శాఖలుగా విడిపోయి బలహీన పడిన సనాతన వైదిక ధర్మాన్ని పునరుద్ధరించటానికి ఆర్యావర్తనమంతా పర్యటించి జాతి జనులను చైతన్యవంతులను చేయి. అదే నీవు మాకిచ్చే గొప్ప గురుదక్షిణ’అనే గురువుల ఆదేశాన్ని పాటిస్తూ.. దేశవ్యాప్తంగా పర్యటిస్తూ, హిందూదేశపు దుస్థితిని చూసి చలించిపోయారు. ఇక.. తన జీవితం సంఘ సంస్కరణ కోసమేనని గట్టిగా సంకల్పించుకున్నారు.

తన పర్యటనా కాలంలోనే సతీ సహగమనం, వరకట్నం, ఆడంబరమైన వివాహ విధులు, బాల్యవివాహాలను నిరసించి హిందూ సమాజాన్ని ప్రగతి బాటన పట్టించే ప్రయత్నం చేశారు. కర్మసిద్ధాంతాన్ని, పునర్జన్మను బలంగా విశ్వసిస్తూనే, నాటి హిందూ సమాజంలోని అర్థం లేని ఆచార వ్యవహారాలను వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే సమాజానికి వేదాల సారాన్ని అందించి చైతన్యపరచాలనే గురువు ఆదేశం మేరకు 1875, ఏప్రిల్‌ 10న ముంబయిలో ఆర్య సమాజ్‌ని ప్రారంభించారు. జర్మనీ నుంచి వేదాల అసలు ప్రతులను తెప్పించి, వాటిని సరళమైన సంస్కృత, హిందీ భాషల్లోకి అనువదించారు. ఋగ్వేద భాష్యము, షోడశ సంస్కారాలు’ అనే రచనలూ చేశారు. వేదాలు మానవులు రచించినవి కావనీ, సాక్షాత్తూ పరమాత్మ నుండే ఉద్భవించాయని బలంగా నమ్మి, కులమతాలకు అతీతంగా అందరూ వేదాధ్యయనం చేయాలని, భగవంతుడు సర్వవ్యాపకుడు కనుక విగ్రహారాధన అవసరం లేదని చెప్పారు. వేదాల సారాన్ని 1875లో ‘సత్యార్థ్‌ ప్రకాశ్‌’పేరుతో పుస్తకంగా రాసి, 1875లో వారణాసిలో ప్రచురించి, పండితుల ముందు చర్చకు పెట్టారు. దీనికి రిఫరెన్స్‌గా 377 పుస్తకాలను, 1542 వేదమంత్రాలు లేక శ్లోకాలను దయానందులు ఉటంకించారు. ఇంత గొప్పపుస్తకాన్ని నెలల వ్యవధిలోనే పూర్తిచేసిన ఘనత దయానందులది. ఆ పుస్తకం ఒక కొత్త సామాజిక దృక్కోణానికి జన్మనిచ్చింది. మతం వ్యక్తిగతమని, కానీ ధర్మం సర్వ మానవాళికీ సంబంధించిందని, కనుక మతం కంటే ధర్మమే గొప్పదని ప్రబోధించారు. విదేశీ భాషలు నేర్చుకోవటం తప్పు కాదని, అయితే, దానికి ముందుగా భారతీయులు సంస్కృతం, హిందీ నేర్చుకోవాలని సూచించారు.

పూర్వకాలంలో హిందువులు సముద్రప్రయాణం చేస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి ఉండేది. అది ఛాందస హిందూ సమాజపు మూఢనమ్మకం మాత్రమేనని, అది ఏమాత్రం అవసరం లేదని ప్రకటించి.. శాశ్వతంగా దానిని తొలగించినది దయానందుడే. హిందువుల కష్టాలను ఆసరా చేసుకుని మతాంతరీకరణకు పాల్పడుతున్న సంస్థల దుర్మార్గాన్ని బహిరంగంగా నిరసించి, అలాంటి దీనుల కోసం పలు సామాజిక సేవాకార్యక్రమాలను దయానందులు ప్రారంభించారు. అనాథలు ఇతర మతాల్లోకి మారకుండా వారికోసం తొలి అనాథ శరణాలయాన్ని ఫిరోజ్ పూర్‌లో స్థాపించారు. పిదప దేశవ్యాప్తంగా అనేక అనాథ శరణాలయాలు స్థాపించి, అక్కడి అనాథలకు వేదవిద్యను అందించి వారు ఇతర మతాల్లోకి మారకుండా చూశారు. వితంతువులకు, ఒంటరి మహిళలకు ఆశ్రమాలను ఏర్పాటు చేసి వారికి ఆశ్రయం కల్పించటంతో బాటు చదువు, స్వయం ఉపాధికి శిక్షణ అందించే ఏర్పాటు చేశారు. అలాంటి మహిళలు తిరిగి వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించేలా ప్రోత్సహించారు. వేదాలలోని మహిళల గొప్పతనాన్ని ప్రచారం చేసి, స్త్రీ సమానత్వం అవసరమని, దానికోసం బాలికలందరికీ ప్రాథమిక విద్య అవసరమంటూ అనేక జాతీయ విద్యాలయాలు ప్రారంభించారు. కులాంతర వివాహాలకు ఆర్యసమాజాన్ని కేంద్రంగా నిలిపి, అక్కడ సాదాసీదాగా వేద ప్రమాణాల మేరకు వివాహాలు జరిగేలా చూసి, కులాల కట్టుబాట్లను తెంచే యత్నం చేశారు. వేదాలను ఆధునిక కోణంలో చూడాలన్న దృక్పథంతో ‘దయానంద భాష్యం’ అనే గ్రంథాన్ని రచించారు. అందులో ఆయన పేర్కొన్న భావనలు ఆనాటి స్వాతంత్ర్య ఉద్యమకారులను ఎంతగానో ప్రేరేపించాయి.

స్వాతంత్ర్య సాధనలో దయానంద సరస్వతి పోరాటం, పాత్ర చిరస్మరణీయమైనది. హిందువులు స్వదేశీ ఉత్పత్తులనే వాడాలని తొలిసారి ప్రకటించినది.. స్వామీజీదే. అలాగే, అనేక భాషలున్న దేశంలో స్వాతంత్ర్య ఉద్యమం అవసరాన్ని చివరి గ్రామం వరకు చేర్చాలంటే ఒక ఉమ్మడి భాష అవసరం ఉందని పిలుపునిచ్చి, హిందీయేతరులు.. హిందీ నేర్చుకునేలా ప్రోత్సహించారు. స్వాతంత్ర్య పోరాటాన్ని దూకుడుగా ముందుకు తీసుకుపోయి.. బ్రిటిషర్లను గడగడలాడించిన యువ నాయకత్వాన్ని తయారు చేసేందుకు దయానందుల ఆలోచనలు.. బలమైన భూమికగా నిలిచాయి. లాలా లజపత్ రాయ్, బాలగంగాధర తిలక్, బిపిన్ చంద్రపాల్, అరవింద ఘోష్, భాయి పరమానంద్, శ్యాంజీ కృష్ణవర్మ, రాంప్రసాద్ బిస్మిల్, భాయి బాల్ ముకుంద్, మదన్‌లాల్‌ ధింగ్రా, మదన్‌మోహన్ మాలవీయ, స్వామి శ్రద్ధానంద, పండిత్ లేఖ్‌రాం వంటి జాతీయ భావాలున్న నేతలంతా దయానందుని శిష్యులే. పాశ్చాత్య సిద్ధాంతాలతో భారతీయ సాంస్కృతిక మూలాలను నాశనం చేస్తూ.. తమది సుపరిపాలన అని బ్రిటిషర్లు చేసుకుంటున్న ప్రచారంలోని డొల్లతనాన్ని నిరసించి, హిందువులకు స్వతంత్ర పరిపాలన కావాల్సిందేనని, అదే ఈ దేశపు ఉనికిని నిలుపుతుందని స్వామీజీ ప్రకటించారు. ‘భరతవర్షం… భారతీయులదే’అనే నినాదాన్ని ప్రచారంలోకి తీసుకువచ్చారు. అదే.. తర్వాతి రోజులలో తిలక్ వంటి మహానాయకుల నోట.. ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అనే నినాదంగా పలికింది. ఇతర మతాల్లోకి మారిన హిందువులను తిరిగి వెనక్కు తీసుకొచ్చే శుద్ధి ఉద్యమాన్ని కూడా స్వామీజీ ప్రారంభించి, వేలాదిమందిని తమ సనాతన ధర్మం దిశగా నడిపించారు. దయానందుల ముఖ్య శిష్యుడైన స్వామి శ్రద్ధానంద 1923 ఫిబ్రవరి 11న భారతీయ శుద్ధి సభను స్థాపించి గురువు చూపిన మార్గంలో నడిచారు. తన యావత్ జీవితాన్ని వేద జ్ఞానం, సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగించడానికి అంకితం చేసిన స్వామీ దయానంద సరస్వతి హైందవ సమాజాన్ని శ్రేయస్సు, స్వేచ్ఛ, సమానత్వం వైపు నడిపించారు. నేటి ఆ భారత తత్వ నిధి 201వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి.