Last Updated:

Jaishankar: ఎల్ఏసీ వద్దకు సైన్యాన్నిపంపించింది ప్రధాని మోదీ.. రాహుల్‌కాదు..విదేశాంగ మంత్రి జైశంకర్

తూర్పు లడఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి విదేశాంగ మంత్రి జైశంకర్ ఘాటుగా సమాధానం ఇచ్చారు.

Jaishankar: ఎల్ఏసీ వద్దకు సైన్యాన్నిపంపించింది ప్రధాని మోదీ.. రాహుల్‌కాదు..విదేశాంగ మంత్రి జైశంకర్

Jaishankar: తూర్పు లడఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి విదేశాంగ మంత్రి జైశంకర్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. చైనా తన దళాలను ఎల్ఏసీ వద్ద మోహరించిందని, ఆ చర్యను తిప్పికొట్టేందుకు అక్కడికి సైన్యాన్ని పంపించినవారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అని, రాహుల్ గాంధీ కాదని అన్నారు. 1962లో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రతిపక్ష పార్టీకి నిజాయితీ ఉండాలన్నారు.

కాంగ్రెస్ కు నిజాయితీ లేదు..(Jaishankar)

జైశంకర్ ఎఎన్‌ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఎల్ఏసీ వద్ద చైనా తన దళాలను మోహరించిందని, ఈ చర్యను దీటుగా తిప్పికొట్టేందుకు అక్కడికి దళాలను పంపించినవారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అని, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కాదని అన్నారు. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను పెంచేందుకు బడ్జెట్‌ను ఐదు రెట్లు పెంచినట్లు తెలిపారు. పాంగాంగ్ సరస్సు వద్ద గత ఏడాది చైనా ఓ వంతెనను నిర్మించడంపై కాంగ్రెస్ తదితర ప్రతిపక్ష పార్టీలు చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ, ఈ ప్రాంతం 1962లో యుద్ధం జరిగినప్పటి నుంచి చైనా చట్టవిరుద్ధ ఆక్రమణలో ఉందన్నారు. ఆంగ్ల అక్షరం ‘సి’తో ప్రారంభమయ్యే పదాలను అర్థం చేసుకోవడంలో కాంగ్రెస్‌కు సమస్య ఉన్నట్లుందన్నారు. ఈ ప్రాంతం ఎప్పటి నుంచి చైనా నియంత్రణలో ఉందని ప్రశ్నించారు. పరిస్థితిని ఉద్దేశపూర్వకంగానే తప్పుగా వివరిస్తున్నారని భావిస్తున్నానని చెప్పారు. చైనీయులు మొదట 1958లో అక్కడికి వచ్చారన్నారు. 1962 అక్టోబరులో చైనీయులు ఆ ప్రాంతాన్ని కబ్జా చేశారన్నారు. ఆ ప్రాంతంలో ఓ వంతెనను చైనా నిర్మిస్తుంటే ఇప్పుడు 2023లో మోదీ ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని మండిపడ్డారు. ఈ కబ్జా ఎప్పుడు జరిగిందో చెప్పే నిజాయితీ కాంగ్రెస్‌కు లేదన్నారు.

తప్పుడు ఆరోపణలు చేయవద్దు..

రాజీవ్ గాంధీ 1988లో బీజింగ్ వెళ్ళారని, 1993, 1996 సంవత్సరాల్లో ఒప్పందాలు జరిగాయని, ఈ ఒప్పందాలను తాను తప్పుబట్టడం లేదని, రాజకీయం చేయడం లేదని చెప్పారు. సరిహద్దులను స్థిరపరచుకోవడం మనకు అవసరమైనందువల్ల ఈ ఒప్పందాలపై సంతకాలు జరిగాయన్నారు. ఇతర దేశాల డిమాండ్లు సమంజసంగా లేనపుడు ఒప్పందాలు కుదుర్చుకోవడం ప్రభుత్వాలకు సాధ్యం కాదన్నారు.మోదీ ప్రభుత్వం చైనా విషయంలో ఆత్మరక్షణలో పడిందనే ఆరోపణలకు మద్దతివ్వవద్దని కోరారు. సర్దుబాటు ధోరణితో ఉంటే, ఎల్ఏసీ వద్దకు సైన్యాన్ని ఎవరు పంపించారని ప్రశ్నించారు. సైన్యాన్ని రాహుల్ గాంధీ పంపించలేదని,నరేంద్ర మోదీ పంపించారన్నారు.

గతంలోకన్నా ఐదురెట్లు పెరిగిన బడ్జెట్..

చైనా సరిహద్దులో మన చరిత్రలో అతి పెద్ద దళాన్ని మోహరించామన్నారు.. భారీ ఖర్చుతో, గొప్ప కృషితో మన దళాలను చైనా సరిహద్దులో ఉంచుతున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం ఈ సరిహద్దు ప్రాంతంలో గతం కన్నా ఐదు రెట్లు ఖర్చు చేసి, మౌలిక సదుపాయాలను నిర్మిస్తోందన్నారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఆత్మరక్షణలో ఉన్నారు? ఎవరు సర్దుబాటు ధోరణితో ఉన్నారు? అని ప్రశ్నించారు. వాస్తవాలను చెప్తున్నదెవరు? విషయాలను కచ్చితంగా వివరిస్తున్నది ఎవరు? చరిత్రతో ఆటలాడుతున్నది ఎవరు? అని పరోక్షంగా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.