Disruption X Service: ‘ఎక్స్’ సేవల్లో అంతరాయం.. యాప్, వెబ్‌సైట్లో సమస్య

Disruption in ‘X’ Services: ఎలాన్ మస్క్‌కు చెందిన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో యాప్, వెబ్‌సైట్లో తీవ్ర సమస్య నెలకొంది. ఇవాళ సాయంత్రం 6 నుంచి సమస్య ప్రారంభమైనట్లు డౌన్ డిటెక్టర్ వెబ్‌సైట్ ద్వారా తెలుస్తోంది. ‘ఎక్స్’ వెబ్‌సైట్, యాప్‌లో కొత్త పోస్టుల కోసం రీఫ్రెష్ చేసినప్పుడు ‘సమ్‌థింగ్ వెంట్ రాంగ్, ట్రై రీలోడింగ్’ అని సందేశం చూపిస్తోంది. శుక్రవారం కూడా భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ‘ఎక్స్’ సేవల్లో అంతరాయం ఏర్పడింది.
‘ఎక్స్’ ఇంజినీర్లు వివరణ..
శుక్రవారం నాటి అంతరాయంపై ‘ఎక్స్’ ఇంజినీర్లు అధికారికంగా వివరణ ఇచ్చారు. డేటా కేంద్రాల్లో ఏర్పడిన సాంకేతిక సమస్య వల్ల ఈ పరిస్థితి నెలకొందని వివరించారు. ఈ కారణంతోనే కొందరు యూజర్లకు లాగిన్, సైనప్ సేవల్లో అవాంతరాలు ఏర్పడొచ్చని పేర్కొన్నారు. నోటిఫికేషన్లు, ప్రీమియం ఫీచర్లలో కొంత ఆలస్యం జరగొచ్చని తెలిపారు. శనివారం కూడా ఇదే తరహా సమస్య తలెత్తడంపై ‘ఎక్స్’ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. వరుసగా రెండో రోజూ ఇదే పరిస్థితి నెలకొనడంతో యూజర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.