Delhi Water Crisis: ఢిల్లీలో కొనసాగుతున్న నీటి సంక్షోభం..
ఉత్తరాదిని ఎండలు ఠారెత్తిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రత దాదాపు 48 డిగ్రీల సెల్సియస్ పైనే నమోదు అవుతోంది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శనివారం ఉదయం నగరంలో ట్యాంకర్ల ముందు చాంతాడంత క్యూలైన్‌లు కనిపించాయి.
Delhi Water Crisis; ఉత్తరాదిని ఎండలు ఠారెత్తిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రత దాదాపు 48 డిగ్రీల సెల్సియస్ పైనే నమోదు అవుతోంది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శనివారం ఉదయం నగరంలో ట్యాంకర్ల ముందు చాంతాడంత క్యూలైన్‌లు కనిపించాయి. నగరంలో పలు ప్రాంతాలు ఉదాహరణకు చీల్లా గావ్, మయూర్ విహార్ ఏరియా, సంజయ్ కాలనీ, ఓక్లా ఏరియా, గీత కాలనీల్లో ట్యాంకర్ల ముందు ప్రజలు బకెట్లు, క్యాన్లు చేతబట్టి క్యూలో నిలుచున్నారు. పగటి ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిపోవడంతో ఢిల్లీలో ఇలాంటి సీన్లు సర్వసాధారణం అయ్యాయి.
నిరాహారదీక్షలో ఆప్ మంత్రి..(Delhi Water Crisis)
ఇక ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. తప్పు మీది అంటే మీదంటే ఇటు అధికార ఆమ్‌ఆద్మీ పార్టీ.. బీజేపీ పార్టీ ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటున్నారు. బీజేపీ పాలిత హర్యానా నుంచి తమకు చట్ట ప్రకారం దక్కాల్సిన వాటా దక్కడం లేదని ఆప్ పార్టీ ఆరోపిస్తోంది కాగా ఢిల్లీ నీటి మంత్రి అతిషి శుక్రవారం సాయంత్రం నుంచి నిరవధిక నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఆమ్‌ఆద్మీ పార్టీకి చెందిన నాయకులు సంజయ్‌సింగ్‌తో పాటు ఇతర నాయకులు కలిసి రాగా జంగాపూర్ ఏరియాలోని బోగాల్ ఏరియాలో ఆమె నిరహారా దీక్షకు కూర్చున్నారు. అంతకు ముందు ఆమె రాజ్‌ఘాట్‌కు వెళ్లి జాతిపిత మహాత్మాగాంధీని శ్రద్ధాంజలి ఘటించి వచ్చారు.
కాగా జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంపిన సందేశాన్ని ఆయన భార్య సునిత చదివి వినిపించారు. తాను జైల్లో టీవీలో ఢిల్లీ ప్రజలు నీటి కోసం పడుతున్న ఇబ్బందులు చూసిన తర్వాత తనకు గుండె తరుక్కుపోతోందన్నారు. అతిషి దీక్ష విజయవంతం అవుతుందని ఆయన ఆశించారు. దేవుడు ఆమెను రక్షిస్తాడని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఢిల్లీ నీటి కొరతకు ఆప్ పార్టీ కారణమని బీజేపీ ఆరోపిస్తోంది. అవినీతి పెంచిపోషించడానికి ట్యాంకర్ మాఫియాను సృష్టించిందని బీజేపీ ఎంపీ బాన్సురీ స్వరాజ్ ఆప్ పార్టీపై మండిపడింది. నీటి కొరత ప్రకృతి సిద్దంగా వచ్చింది కాదని.. ఆమ్ ఆద్మీపార్టీ సృష్టించిందని ఆమె ఆరోపించారు. ఢిల్లీ ప్రజల గొంతెండిపోతుంటే .. ఆప్ ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని బీజేపీ ఎంపీ మండిపడ్డారు. ఒక పక్క ఢిల్లీ ప్రజల దాహాన్ని తీర్చాల్సిన మంత్రి నిరహార దీక్షకు కూర్చోవడం ఏమిటని ఆమె ఆప్ ప్రభుత్వాన్ని నిలదీశారు.