UP Assembly : ఎమ్మెల్యే నిర్వాకం.. గుట్కా నిషేధిస్తూ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం

UP Assembly : యూపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఓ ఎమ్మెల్యే గుట్కా తిని కార్పెట్‌పై ఉమ్మివేయగా, స్పీకర్ సతీశ్ మహాన ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా గుట్కా వినియోగంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి అసెంబ్లీ ప్రాంగణంలో గుట్కా తినడంపై నిషేధం విధించారు. ఎవరైనా సరే నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పీకర్ హెచ్చరించారు.
మంగళవారం బడ్జెట్ సమావేశానికి ముందు స్పీకర్ అసెంబ్లీలోకి వస్తున్నాడు. ఈ సమయంలో కార్పెట్‌పై గుట్కా గుర్తులను ఆయన గమనించారు. ఈ నిర్వాకం చేసిన ఎమ్మెల్యే ఎవరో తనకు తెలుసు అన్నారు. వీడియోలో తాను అంతా చూసినట్లు చెప్పారు. ఎవరినీ కించపరచాలని అనుకోవడం లేదని స్పష్టం చేశారు. అందుకు ఇప్పుడు వారి పేరును ప్రస్తావించడం లేదన్నారు. ఎవరైనా ఇలాంటి పనిచేస్తే మిగతా సభ్యులు అడ్డుకోవాలని కోరారు. అసెంబ్లీని పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని సూచించారు. ఎమ్మెల్యే తప్పును అంగీకరిస్తే బాగుంటుందన్నారు. లేకపోతే అతడిని తానే పిలుస్తానని స్పీకర్ హెచ్చరించారు.
ఇదేమీ వ్యక్తిగత ఆస్తి కాదు..
అనంతరం దగ్గర ఉండి కార్పెట్‌ను శుభ్రం చేయించారు. ఓ వ్యక్తి చేసిన పనికి మిగతా వారి గౌరవం ఎందుకు దెబ్బతీయాలంటూ స్పీకర్ ప్రశ్నించారు. అసెంబ్లీ ప్రజలకు చెందిందని, ఇదేమీ వ్యక్తిగత ఆస్తి కాదని మండిపడ్డారు. అసెంబ్లీలో జరిగిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. మరోసారి ఇలాంటి తప్పు జరగకుండా అసెంబ్లీ ప్రాంగణంలో గుట్కా, పాన్ మసాలా వినియోగించడంపై స్పీకర్ నిషేధం విధించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ. వెయ్యి జరిమానా విధించనున్నారు.