Last Updated:

shivaji maharaj jayanti 2025: యుగ పురుషుడు.. ఛత్రపతి శివాజీ

shivaji maharaj jayanti 2025: యుగ పురుషుడు.. ఛత్రపతి శివాజీ

Chhatrapati Shivaji Maharaj’s 395th birth anniversary: హైందవ జాతి గర్వించదగిన యుగపురుషులలో ఛత్రపతి శివాజీ మహరాజ్ ప్రాతఃస్మరణీయులు. మరాఠా నేలపై జన్మించి మ్లేచ్ఛుల కబంధ హస్తాలలో మగ్గిపోతున్న భరతమాత దాస్య శృంఖలాలను తెగదెంచిన వీరుడిగా, హిందూ రాష్ట్ర నిర్మాణం కోసం స్వప్పించిన దార్శనికుడిగా భరతజాతి మనోఫలకంపై శివాజీ శాశ్వతంగా నిలిచిపోయారు. ఆ మహాపురుషుని ఉత్తేజకరమైన జ్ఞాపకాలు, సాధించిన విజయాలు, మాతృభూమికై చేసిన త్యాగాలు, పాటించిన ఆదర్శాలు నేటికీ మన భరతజాతికి దీపస్తంభం వలే మార్గదర్శకత్వం వహిస్తూనే ఉన్నాయి. అచంచలమైన విశ్వాసం, ఎవరికీ తలవంచని ఆత్మగౌరవం, మూర్తీభవించిన ధైర్యం, అపారమైన పరమత సహనం, హిందూ ధర్మ పరిరక్షణ పట్ల అమేయమైన నిబద్ధత గల యోధుడిగా శివాజీ మనకు కనిపిస్తారు. నిరంకుశ మొఘల్ సామ్రాజ్య పతనాన్ని శాసించి, మరాఠాల ఘనతను చాటిచెప్పిన వీరుడిగా, యువతలో స్వాతంత్ర్య పిపిసను రగల్చిన అగ్నికణంగా నిలిచారు. భరతజాతి పునర్వైభవ సాధనే లక్ష్యంగా సాగిన ఆయన జీవితం వందల ఏళ్లుగా హైందవజాతికి నిత్యం స్ఫూర్తిని ఇస్తూనే ఉంది. నేడు ఆ మహావీరుని 395వ జయంతి.

నేటి మహారాష్ట్రలోని పుణె జిల్లాలోని జున్నార్‌ పట్టణం దగ్గర శివనేరి కోటలో క్రీ.శ 1630 ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్ష తదియ తిథి రోజున (ఫిబ్రవరి 19) షాహాజీ, జిజియా బాయి దంపతులకు శివాజీ జన్మించాడు. వీరిది భోస్లే.. అనే వ్యవసాయం చేసుకునే కులం. శివాజీ తల్లి దేవగిరి యాదవరాజుల ఆడపడుచు. చదువు, యుద్ధ విద్యలతో బాటు బాల్యం నుంచి తల్లి చెప్పిన రామాయణ, భారత గాథల మూలంగా యుక్తవయసు నాటికి శివాజీ గొప్ప వీరుడిగా, జాతీయ భావాలు గల దేశ భక్తుడిగా ఎదిగాడు. సమర్థ రామదాసు గురువుగా లభించటంతో ఆయన వ్యక్తిత్వం మరింత పరిమళించింది. తండ్రి జాగీర్దారుగా పనిచేయటంతో ఆయన యుద్ధ అనుభవాలు బాల్యంలోనే శివాజీ మనసును ఆకర్షించాయి. దీంతో తన 17వ ఏట తొలిసారి యుద్ధభూమిలో అడుగుపెట్టి.. బీజాపూర్‌ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను, 21వ ఏట రాజ్‌గఢ్‌ కోటను వశపరుచుకున్నారు. అనంతరం తండ్రి వద్ద ఉన్న 2 వేల సేనను పదివేలకు పెంచి, వారికి మంచి శిక్షణనిచ్చారు. నిఘా విభాగం, ఆధునిక యుద్ధ తంత్రాలు, అప్పటికప్పుడు మారిపోయే యుద్ధనీతితో.. ఊహించని రీతిలో శత్రువు మీద మెరుపుదాడులు చేసి గెరిల్లా యుద్ధరీతిని పాటిస్తూ బీజాపూర్‌కు చెందిన తోరణ దుర్గాన్ని చేజిక్కించుకుని, పూణె ప్రాంతం మీద పట్టు సాధించాడు.

నిండా పాతికేళ్లు కూడా లేని ఒక సాధారణ జాగీర్దారు కుమారుడు.. తమ కోటలను అతి తక్కువ సమయంలో స్వాధీనం చేసుకోవటంతో మండిపడిన నాటి పాలకుడు మహ్మద్ ఆదిల్‌ షా.. కుట్ర చేసి శివాజీ తండ్రి బంధిస్తాడు. అనంతరం శివాజీని, అతని సోదరుడిని బంధించేందుకు సేనలను పంపగా, శివాజీ సేనలు వారిని తరిమికొట్టి.. షాహాజీని విడిపించుకుంటారు. దీంతో ఆదిల్ షా.. అరివీర భయంకరుడిగా పేరున్న అఫ్జల్ ఖాన్‌ను యుద్ధానికి పంపుతాడు. అతడు.. శివాజీని రెచ్చగొట్టేందుకు శివాజీ ఇష్టదైవమైన భవానీ ఆలయాన్ని కూలగొట్టించి కవ్విస్తాడు. అయితే, తాను యుద్ధానికి సిద్ధంగా లేనని, కావాలనుకుంటే తనను ప్రతాప్‌ఘడ్ కోటలో కలవొచ్చిన శివాజీ కబురు పెడతాడు. ఈ భేటీ వేళ.. అంగ రక్షకులు బయట వేచి ఉండగా, అఫ్జల్ ఖాన్ దాచుకున్న కత్తితో శివాజీ మీద దాడి చేస్తాడు. కానీ.. ఉక్కు కవచాన్ని ధరించి ఉండటంతో శివాజీ ఆ దాడి నుంచి బయటపడతాడు. ఆ పెనుగులాట సందర్భంగా శివాజీ పులిగోర్ల పిడితో అఫ్జల్ ఖాన్‌ పొట్టను చీల్చగా, అతడు తప్పించుకొని పారిపోతుండగా, ఒక్క వేటుతో అఫ్జల్ ఖాన్ తల నరుకుతాడు. అనంతరం బీజాపూర్ సుల్తాను.. అఫ్ఘానిస్థాన్ నుంచి తీసుకొచ్చిన యుద్ధ వీరులతో శివాజీ మీద దాడిచేయగా శివాజీ అతడి సేనలకు అడవిలో దిగ్బంధం చేసి తన గెరిల్లా వ్యూహంతో ఆ సేనలను మట్టి కరిపిస్తాడు.

దీంతో తీవ్ర పరాభవ భావనతో బీజాపూర్ సుల్తాన్ అరబ్, పర్షియా నుంచి 10 వేల కిరాయి సేనలను పిలిపించి, శివాజీ మీదకు ఉసిగొలపగా, తన 5 వేల మరాఠా సేనలతో కొల్హాపూర్ వద్ద వారిని చక్రబంధనం చేసి ఒక్కడినీ మిగలకుండా చేస్తాడు. దీంతో దేశవ్యాప్తంగా శివాజీ పేరు మారుమోగిపోవటమే గాక మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. దక్కనులో శివాజీ విజృంభణ ఢిల్లీ దిశగా సాగుతుందనే భయంతో తన మేనమామ పహిస్తా ఖాన్‌ను శివాజీపై దాడికి పంపినా మళ్లీ పరాజయమే సిద్ధిస్తుంది. దీంతో 1666లో ఔరంగజేబు తన 50వ పుట్టినరోజు పేరుతో సామరస్య భేటీ అంటూ శివాజీని, అతని ఆరేళ్ల కుమారుడు శంభాజీని ఢిల్లీకి ఆహ్వానించి ఆగ్రా కోటలో బంధిస్తాడు. కానీ, శివాజీ చాకచక్యంతో కుమారుడితో సహా అక్కడి నుంచి బయటపడతాడు. 1674 నాటికి శివాజీ లక్ష సైన్యాన్ని, ఆధునిక ఆయుధాలను, గొప్ప అశ్విక, నావికా దళాన్ని ఏర్పరచుకుని, హైందవరాజులకు అండగా నిలిచి ఢిల్లీ పాదుషాకు కొరకరాని కొయ్యగా మారతాడు. ఈ క్రమంలోనే 1674వ సంవత్సరం జ్యేష్ట శుద్ధ త్రయోదశి (జూన్‌ 6న) రాయగఢ్‌ కోటలో వేదోక్తంగా క్షత్రియ రాజులంతా కలిసి శివాజీకి పట్టాభిషేకం చేసి, ‘ఛత్రపతి’అనే బిరుదును ప్రదానం చేశారు. పిదప శివాజీ 50 వేల బలగాలతో దక్షిణాదిలోని వెల్లూరు తదితర ప్రాంతాల మీద దాడి చేసి ముస్లింల ఆధీనంలోని ప్రాంతాలకు విముక్తి కలిగిస్తాడు. ఇలా.. 27 సంవత్సరాల పాటు అనేక యుద్ధాలను చేసిన శివాజీ సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి, విదేశీ పాలకుల చేతిలో భారతీయ సంస్కృతి మటుమాయం కాకుండా నివారించగలిగాడు.

తన జీవిత కాలంలో ఎన్నో యుద్ధాలు చేసినా ఎన్నడూ అన్యమత ప్రార్థనా స్థలాలను ధ్వంసం చేయటం గానీ, పరాజితుల కుటుంబ సభ్యులను, శరణుజొచ్చిన సేనలను చంపటంగానీ చేయలేదు. శివాజీ సైన్యంలో ముస్లింలది ప్రధాన పాత్రగా ఉండేది. జీవితాంతం ముస్లిం రాజులకు వ్యతిరేకంగా పోరాడిన ఛత్రపతి శివాజీ వెంటే చివరి వరకు వారంతా అండగా నిలిచారు. నిస్వార్థ పాలకుడిగా, మచ్చలేని వ్యక్తిత్వమున్న మహా మనీషిగా, క్రమశిక్షణ, ఉత్తమ మానవ విలువలు గల ఆదర్శపురుషుడిగా నిలిచిన శివాజీ ధర్మ సంరక్షణ, మాతృభూమి విముక్తికై జీవితాంతం పోరాడారు. ఈ క్రమంలోనే మూడు వారాల పాటు తీవ్ర జ్వరంతో బాధపడి 1680 ఏప్రిల్‌ 3 మధ్యాహ్నం 12 గంటలకు రాయగఢ్‌ కోటలో ఆ మహావీరుడు శివైక్యం చెందారు. అత్యంత సామాన్య కుటుంబంలో జన్మించి, కేవలం 57 సంవత్సరాలు మాత్రమే జీవించిన ఆ మహావీరుడి జీవితం భరత జాతికి సుమారు 4 శతాబ్దాలుగా స్ఫూర్తినిస్తూనే ఉంది. శివాజీ స్మృతులను భారత ప్రభుత్వం చెక్కుచెదరకుండా కాపాడే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా వందల ఏళ్ల పాటు లండన్ లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో ఉన్న వ్యాఘ్ నఖ్ అనే ఆయుధాన్ని తిరిగి భారత్‌కు తీసుకొచ్చింది. దీనితోనే నాడు శివాజీ.. నాటి మొఘల్ సేనాని అప్జల్ ఖాన్‌ను అంతమొందించాడని చెబుతారు. అలాగే, భారత నావికా దళం కొత్తగా రూపొందించిన 5 కొత్త బ్యాడ్జీలలో శివాజీ రాజముద్ర చిహ్నాలను పొందుపరచారు.