Published On:

Ethanol Company: పెద్ద ధన్వాడలో ఘర్షణ.. 40 మందిపై కేసు

Ethanol Company: పెద్ద ధన్వాడలో ఘర్షణ.. 40 మందిపై కేసు

Police Filed case: తమ గ్రామాల పరిధిలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేయొద్దని జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో నిన్న ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. గాయత్రి కంపెనీకి చెందిన ప్రతినిధులు వ్యవసాయ భూముల్లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు పనులు చేస్తున్నారని తెలుసుకుని మండలంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కంపెనీ నిర్వహిస్తున్న పనులను అడ్డుకున్నారు. వాహనాలను ధ్వంసం చేశారు. కంపెనీకి సంబంధించిన ఆస్తులకు నిప్పుపెట్టారు.

 

దీంతో కంపెనీ ప్రతినిధులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరుకున్న భద్రతా బలగాలు గ్రామస్తులను అడ్డుకున్నాయి. దీంతో పోలీసులకు, గ్రామస్థులకు ఘర్షణ జరిగి పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. కాగా జరిగిన ఘటనపై గాయత్రీ కంపెనీ సీఈఓ మంజునాథ్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు 40 మందిపై కేసులు నమోదు చేశారు. దాడికి పాల్పడిన వారిని రెండు వాహనాల్లో మానవపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. దాడులకు పాల్పడిన వీడియోలు.. ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం 40 మంది ఘర్షణలు, ఉద్రిక్తతకు కారణమని నిర్ధారించారు. వీరిలో 12 మందిని పోలీసులు అరెస్ట్ చేసి ఇవాళ కోర్టులో ప్రవేశ పెట్టారు. మిగిలిన వారిలో గాయపడిన కొందరికి వైద్యసేవలు అందుతుండగా.. మరికొందరు పరారీలో ఉన్నట్టు సమాచారం.