Published On:

CM Revanth Reddy: కేసీఆర్, హరీశ్‌రావు సంతకాలే తెలంగాణకు మరణశాసనం: సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy: కేసీఆర్, హరీశ్‌రావు సంతకాలే తెలంగాణకు మరణశాసనం: సీఎం రేవంత్‌రెడ్డి

Banakacharla Project: రాష్ట్ర ప్రజల హక్కులు కాపాడటంలో తాము ఎప్పుడూ ముందుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం ప్రజాభవన్‌లో గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నీటిహక్కుల కోసం ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్, హరీశ్‌రావుల వద్ద ఇరిగేషన్ శాఖలు ఉన్నాయని తెలిపారు. నీళ్లు తెస్తారని ప్రజలు నమ్మి అధికారం ఇస్తే, మోసం చేశారని విమర్శించారు.

 

గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాలు తమకు గుదిబండగా మారాయన్నారు. నీళ్ల కోసం తెలంగాణ ఉద్యమం సాగిందని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం నీటి విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నదని చెప్పారు. కృష్ణాలో ప్రాజెక్టులు పూర్తయి ఉంటే కొట్లాడైనా నీళ్లు తెచ్చుకునే వాళ్లమన్నారు. నీటి వివాదాల పరిష్కారంపై కేంద్రం దృష్టి పెట్టడం లేదని అసహనం వ్యక్త చేశారు.

 

కృష్ణా నదిలో 68 శాతం పరివాహకం తెలంగాణలో ఉన్నా, రాష్ట్రానికి 299 టీఎంసీలే సరిపోతాయని గతంలో కేసీఆర్ మరణశాసనం రాశారని సీఎం రేవంత్ మండిపడ్డారు. లెక్క ప్రకారం తెలంగాణ 68 శాతం నీటిని వాడుకొని, మిగిలిన నీటిని ఏపీకి ఇవ్వాలన్నారు. కానీ, 299 టీఎంసీలే చాలని కేసీఆర్ రెండుసార్లు సంతకం చేశారని మండిపడ్డారు. 299 టీఎంసీలు ఉన్నా ఏనాడు 220 టీఎంసీలకు మించి వాడలేదని విమర్శించారు.

 

అంతకుముందు ఉత్తమ్ మాట్లాడారు. పోలవరం-బనకచర్లపై కేంద్రానికి తెలంగాణ అభ్యంతరాలను తెలిపామని చెప్పారు. బనకచర్ల ప్రాజెక్టు గోదావరి వాటర్‌ ట్రైబ్యునల్‌ తీర్పునకు వ్యతిరేకమని వాదించామన్నారు. ఏపీ సర్కారు చేసిన బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపగా, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మంగళవారం ప్రజాభవన్‌లో పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి: