TGSRTC: ఆర్టీసీలో ఇక నుంచి ఫ్రీ వైఫై

RTC Decided To Provide Free WiFi: ప్రయాణికుల సౌకర్యాల కోసం తెలంగాణ ఆర్టీసీ ఎప్పటికప్పుడూ సన్నద్ధం అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే వారికి పలు రకాల సేవలు అందిస్తోంది. అలాగే నిర్వహణలోనూ ఎప్పటికప్పుడూ అప్డేట్ అవుతోంది. అందులో భాగంగానే ప్రయాణికులకు బస్టాండ్లలో, ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా వైఫై అందించేందుకు సిద్ధమైంది. బస్సు ప్రయాణాలను, బస్సు కోసం ఎదురుచూసే టైంలో వారి సమయాన్ని ఆనందంగా మార్చేందుకుగాను ఈ ఏర్పాటు చేయబోతోంది.
ఈ విషయమై తెలంగాణ ఆర్టీసీ ఓ ప్రైవేట్ సంస్థతో చర్చలు జరిపినట్టుగా సమాచారం. ఈ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించగా ఆర్టీసీ అధికారులు ఈ ప్రణాళికపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనిపై సంతృప్తి చెందిన మంత్రి పొన్నం, వైఫై సౌకర్యం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఆర్టీసీ అధికారులు ఈ మేరకు చర్యలు వేగవంతం చేశారు.
మొదటి దశలో.. అన్ని రకాల బస్సులు, బస్ స్టేషన్లలో వైఫై సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే కొద్దిరోజులపాటు ప్రయాణికులు ముందుగా ఎంపిక చేసిన సినిమాలు, పాటలను మాత్రమే చూడగలుగుతారు. తదుపరి దశలో సాధారణ ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించనున్నారు. అప్పుడు ప్రయాణికులు తమకు ఇష్టమైన వీడియోలను చూసే అవకాశం ఉంటుంది. అయితే వైఫై సౌకర్యాన్ని వాడుకునే సమయంలో మధ్యలో ప్రకటనలు వస్తాయని తెలిపింది. దీనివలన ఆర్టీసీకి భారీగా ఆదాయం వస్తుందని అధికారులు భావిస్తున్నారు. వచ్చిన ఆదాయాన్ని ఇంటర్నెట్ సంస్థ, ఆర్టీసీ యజమాన్యానికి చెరి సగం వెళ్లనుంది. దీనివల్ల ఆర్టీసీ ప్రయాణికులకు వినోదాన్ని పంచుతూనే, సంస్థకు అదనపు ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశం కలుగుతుంది. ప్రయాణికులు నిరీక్షణ సమయాన్ని లేదా ప్రయాణ కాలాన్ని ఆనందంగా గడపడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నారు.