CM Revanth: పది పాసైతే ఇంటర్ చేయాల్సిందే!

CM Review On Education Department: రాష్ట్రంలో పదో తరగతి పాసైన ప్రతి ఒక్క విద్యార్థి తప్పనిసరిగా ఇంటర్ పూర్తి చేసేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పదో తరగతిలో పెద్ద సంఖ్యలో ఉత్తీర్ణులైన విద్యార్థులు.. ఇంటర్ లో మాత్రం ఆ సంఖ్య గణనీయంగా పడిపోతోందని అన్నారు. ఈ మేరకు విద్యాశాఖపై ఐసీసీసీలో సీఎం రేవంత్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. విద్యార్థి జీవితంలో ఇంటర్ చాలా కీలకమైన దశ అన్నారు. వారికి సరైన మార్గదర్శనం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
ఇతర రాష్ట్రాల్లో 9 నుంచి 12వ తరగతి వరకు ఉంటుందని, అక్కడ డ్రాపౌట్స్ సంఖ్య తక్కువగా ఉందని అధికారులు సీఎంకు తెలిపారు. ఇంటర్ వేరుగా 12వ తరగతి వరకు పాఠశాలలు ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందో అధ్యయన చేసి నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో విద్యా కమిషన్, ఎన్జీవోలు, పౌర సమాజం సూచనలు, సలహాలు పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ఇంటర్ విద్యా మెరుగుదలకు సంబంధించి అసెంబ్లీలో చర్చ పెడతామన్నారు. ఇంటర్ అడ్మిషన్ తో పాటు.. విద్యార్థుల హాజరుపై కూడా అధికారులు దృష్టి పెట్టాలన్నారు.
మరోవైపు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ నమూనాను సీఎం పరిశీలించారు. ప్రతి పాఠశాల ఆవరణలో జాతీయ జెండా ఏర్పాటు చేయాలని సూచించారు. నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని, ప్రతివారం ప్రగతి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో బాలురకు ఒకటి, బాలికలకు ఒకటి చొప్పున స్కూళ్లు నిర్మిస్తామన్నారు. ఒక్క పాఠశాలకు ఇప్పటికే స్థల సేకరణ పూర్తయిందని, రెండో పాఠశాల కోసం స్థలం గుర్తింపు, భూ సేకరణ పై దృష్టి పెట్టాలన్నారు. అలాగే వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం నిర్మాణ నమూనాను సీఎం రేవంత్ పరిశీలించారు. పలు మార్పులు సూచించారు. సాధ్యమైనంత త్వరగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.