Last Updated:

HCA: హెచ్ సీఏ లో పెద్దల ఆధిపత్యానికి చెక్ పెట్టిన సుప్రీంకోర్టు

ఎప్పుడూ అవినీతి అక్రమాలతో వార్తల్లో నిలుస్తోన్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

HCA: హెచ్ సీఏ లో పెద్దల ఆధిపత్యానికి చెక్ పెట్టిన సుప్రీంకోర్టు
HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్.. ఎప్పుడూ అవినీతి అక్రమాలతో వార్తల్లో నిలుస్తోంది. హెచ్ సీఏ కమిటీని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.  ప్రస్తుత కమిటీ స్థానంలో మాజీ జడ్జ్ లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది.
దీంతో కమిటీ కార్యకలాపాలు, నిర్వహణ, ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలను జస్టిస్ లావు నాగేశ్వరరావు చూసుకోనున్నారు. హెచ్ సీఏ ఎన్నికలు కూడా ఆయన ఆధ్వర్యంలోనే నిర్వహించాలని సూచించింది.
హెచ్ సీఏ లో ఎన్నికల ప్రతిష్టంభన తొలగించి నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపాలనే ఆలోచనతోనే సర్వోన్నత న్యాయ స్థానం ఈ నిర్ణయం తీసుకుంది.

కమిటీకి అన్ని విధాలా సహకరించాలి(HCA)

హెచ్ సీఏ లో పెండింగ్ లో ఉన్న సమస్యలను ఏక సభ్య కమిటీ పరిష్కరిస్తుందని సుప్రీం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. హెచ్ సీ ఏ వర్గాలు.. ఏకసభ్య కమిటీకి అన్ని విధాలా సహకారం అందించాలని ఆదేశించింది.
మార్చి 2 వ తేదీతో కమిటీ పదవీ కాలం ముగుస్తుందని తెలిపింది. కమిటీ ఖర్చులను అసోసియేషన్ భరించాలని ఆదేశించింది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో తలెత్తిన వివాదాల పరిష్కారం కోసం గతంలో జస్టిస్ దీపక్ వర్మను అంబుడ్స్ మన్ గా నియమించుకుంది కమిటీ.
అయితే ఆయన నియామకాన్ని సవాల్ చేస్తూ కొన్ని క్రికెట్ సంఘాలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాయి. కానీ ఈ పిటిషన్ ను హైకోర్టు కొట్టేయడంతో ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది.
ఈ పిటిషన్ పై సుప్రీం మంగళవారం విచారణ చేపట్టింది.
హెచ్ సీ ఏ ఎన్నికల నిర్వహణను జస్టిస్ లావు నాగేశ్వరరావుకు అప్పజెప్పాలని ప్రతివాదుల తరపు న్యాయవాది సిద్ధార్థదవే సుప్రీంకు ప్రతిపాదించారు.
అన్ని వర్గాల న్యాయవాదులు ఈ ప్రతిపాదనకు అంగీకరించడంతో హెచ్ సీఏ కమిటీ రద్దుకు సుప్రీం అంగీకరించింది.
జస్టిస్ లావు నాగేశ్వరరావు గతంలో భారత ఒలింపిక్ సంఘం ఎలక్టోరల్ కాలేజీ ఖరారు ప్రక్రియను పర్యవేక్షించారు.

ఆధిపత్యానికి తెర

హెచ్ సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్, ఇతర కమిటీ సభ్యుల మధ్య విభేదాల నేపథ్యంలో హెచ్ సీ ఏ తరచూ వార్తలో నిలుస్తూ వచ్చింది.

హెచ్ సీఏ సంబంధించి పలు కేసులు కోర్టుల్లో నమోదయ్యాయి. గత ఏడాది ఆగష్టు 22 హెచ్ సీఏ పర్యవేక్షణ కోసం సుప్రీం కోర్టు జస్టిస్ కక్రూ కమిటీని ఏర్పాటు చేసింది.

అయితే ఆ కమిటీలోనూ విభేదాలు రావడంతో.. కమిటీ లోని సభ్యుడైన వంగా ప్రతాప్ హెచ్ సీఏ లో ఆధిపత్యం చెలాయిస్తు వస్తున్నారనే విమర్శలు వచ్చాయి.

మరో వైపు పదవీ కాలం ముగుస్తున్నా..హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ను వదలని అజహరుద్దీన్ పాటు, వంగా ప్రతాప్ పైన తీవ్రమైన ఆరోపణలు వినిపించాయి.

తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో హెచ్ సీఏ ప్రక్షాళన కానుంది. కొందరి చేతుల్లో ఉన్న హెచ్ సీఏ ఆధిపత్యానికి తెరపడనుంది.