HCU: కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు సీరియస్

HCU: కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మరోసారి సీరియస్ అయ్యింది. ఈ కేసుపై జస్టిస్ గవాయి, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ ధర్మాసనం విచారణ జరిపింది. కంచ గచ్చిబౌలి భూములలో చెట్ల నరికివేతపై తెలంగాణ ప్రభుత్వ అధికారులను మరోసారి సుప్రీంకోర్టు హెచ్చరించింది. కంచ గచ్చిబౌలిలో పర్యావరణాన్ని పునరుద్ధరించకపోతే జైలుకి వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది.
మొక్కలు నాటకపోతే చీఫ్ సెక్రటరీపై చర్యలు తీసుకుంటామని చెప్పింది సుప్రీంకోర్టు. అధికారులు సమర్ధించుకునే ప్రయత్నం చేయొద్దని పేర్కొంది. డజన్ల కొద్ది బుల్డోజర్లు తీసుకొచ్చి చెట్లు నరికారని సుప్రీంకోర్టు తెలిపింది. వారాంతంలో చెట్లు నరకడంలో ఆంతర్యం ఏమిటి? అని ప్రశ్నించింది. సుస్థిర అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని చెప్పింది. చెట్ల నరికివేతను సమర్ధించుకోవద్దు వాటిని ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణ జూలై 23 కు వాయిదా వేసింది.