DC vs PBKS: నేడు ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య పోరు.. గెలుపెవరిదో?

Delhi Capitals Vs Panjab King in IPL 2025: ఐపీఎల్ సీజన్ 2025 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికీ లీగ్ మ్యాచ్ లు తుదిదశకు చేరుకున్నాయి. ఇక ప్లేఆఫ్స్ లో చోటు దక్కించుకునేందుకు జట్లు నువ్వా, నేనా అనేలా పోటీ పడుతున్నాయి. మరోవైపు ఒక్కో మ్యాచ్ లో ఊహించని ఫలితాలు వస్తున్నాయి. దీంతో ప్లేఆఫ్స్ రేసులో నిలిచే జట్లపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే నేడు ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య కీలక పోరు జరగనుంది. నేడు రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.
కాగా నేటి మ్యాచ్ లో ఢిల్లీపై గెలిచి టాప్-2 లో చోటు దక్కించుకోవాలని చూస్తోంది. నేటి మ్యాచ్ లో ఢిల్లీపై గెలిస్తే పంజాబ్ పాయింట్స్ టేబుల్ లో టాప్- 2 లోకి వెళ్లడమే కాకుండా నేరు క్వాలిఫయర్-1 ఆడే అవకాశాలు ఉంటాయి. మరోవైపు ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి దూరమైన ఢిల్లీ క్యాపిటల్స్ ఆఖరి లీగ్ మ్యాచ్ లో గెలిచి.. టోర్నీని విజయంతో ముగించాలని చూస్తోంది.
కాగా ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మే 8న ధర్మశాలలో మ్యాచ్ జరిగింది. కానీ భారత్- పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో మ్యాచ్ రద్దైంది. అలాగే ఐపీఎల్ షెడ్యూల్ ను కూడా మార్చేశారు. అనంతరం మ్యాచ్ లు ప్రారంభమైన తర్వాత పంజాబ్ జట్టులోని కీలక ప్లేయర్లు మార్కస్ స్టోయినిస్, జోష్ ఇంగ్లిస్, ఆరోన్ హార్డీ, కైల్ జెమీసన్ జట్టులోకి చేరారు. దీంతో జట్టుకు మరింత బలం చేకూరింది. అయితే ఈ సీజన్ లో పంజాబ్ జట్టు గొప్పగా రాణిస్తోంది. 2014 తర్వాత ఆ జట్టు లీగ్ టేబుల్ లో ఆగ్రస్థానంలో నిలిచి ఫైనల్ పోరు కోసం ఆరాటపడుతోంది.
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టును అద్భుతంగా నడిపిస్తూ.. ఆటలోనూ రాణిస్తున్నాడు. ప్రభ్ సిమ్రన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య కూడా బ్యాటింగ్ లో తమ పవర్ చూపిస్తున్నారు. ఇక అర్ష్ దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్ లో సత్తా చాటుతున్నారు. వీరంతా ఇదే జోరు కొనసాగిస్తే పంజాబ్ క్వాలిఫయర్-1 మ్యాచ్ ఆడటం పెద్ద కష్టం కాకపోవచ్చు.
మరోవైపు ప్లేఆఫ్స్ అవకాశాల కోసం ముంబై ఇండియన్స్ తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఘోరంగా ఓడిపోయింది. దీంతో ప్లే ఆఫ్స్ అవకాశాలను వదులుకుంది. సీజన్ ఆరంభంలో ఆ జట్టు అద్భుతంగా రాణించినా తర్వాత తేలిపోయింది. మ్యాచ్ కీలక దశలో ఆ జట్టు ఆశించిన విధంగా ఆడకపోవడం, జట్టులో కీలక ప్లేయర్లు దూరం కావడం మైనస్ గా మారింది. దీంతో ఈ సీజన్ లో ఆఖరి లీగ్ మ్యాచ్ ను పంజాబ్ పై గెలుపుతో ముగించాలని చూస్తోంది.