Published On:

CM Revanth Reddy: ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. అమరులకు సీఎం రేవంత్ నివాళులు

CM Revanth Reddy: ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. అమరులకు సీఎం రేవంత్ నివాళులు

CM Revanth Reddy in Telangana Formation Day Celebrations: తెలంగాణలో రాష్ట్ర అవతరణ వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌కు చేరుకున్నారు. ఈ మేరకు అమరుల స్థూపం వద్ద సీఎం రేవంత్ నివాళులర్పించారు. అనంతరం పరేడ్ గ్రౌండ్‌కు బయలుదేరారు. పరేడ్‌గ్రౌండ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు మెడల్స్ పంపిణీ చేయనున్నారు. ఈ వేడుకలకు జపాన్ ప్రతినిధి బృందం హాజరుకానుంది.

 

కాగా, తెలంగాణ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆర్థికంగా, సాంకేతికంగా అభివృద్ధి సాధిస్తోందన్నారు. ఈ రాష్ట్రం శక్తిమంతమైన పర్యావరణ వ్యవస్థ కలిగి ఉందన్నారు. తెలంగాణ ప్రజలు పురోగతిలో మరింత ముందుకు సాగాలని కోరుతున్నట్లు తెలిపారు.

 

మరోవైపు, రాజ్‌భవన్‌లో తెలంగాన ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అలాగే, గాంధీభవన్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, నేతలు పాల్గొన్నారు.

 

ఇక, మండలి ఆవరణలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు విజయశాంతి, కోదండరాం తదితరులు పాల్గొన్నారు. శాసనసభ ఆవరణలో స్పీకర్ గడ్డం ప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.