Harish Rao:అహంకారం వద్దు.. రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు ఫైర్

Harish Rao: సీఎం రేవంత్ రెడ్డిపై సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అహంకారంతో మాట్లాడితే తెలంగాణ ప్రజలు అద:పాతాళానికి తొక్కుతారని హెచ్చరించారు. ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బ్యాగ్ మ్యాన్ గా పనిచేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ రాష్ట్ర హక్కులు, ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తుందన్నారు. రేవంత్ రెడ్డి మాత్రం కేవలం రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు.
ఇటీవల ప్రగతిభవన్‌లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై హరీశ్‌రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ప్రెజెంటేషన్ హైదరాబాద్‌లో కాకుండా అమరావతిలో ఇచ్చినట్లు ఉందన్నారు. అలాగే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే తయారు చేసిందనే అనుమానం కలుగుతోందని ఎద్దవా చేశారు. బనకచర్ల ప్రాజెక్టును ఏపీ సీఎం ఎలా ముందుకు తీసుకువెళ్తున్నారో, ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఆ ప్రజెంటేషన్‌లో ఉద్దేశపూర్వకంగానే చూపించలేదని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి బనకచర్ల కట్టే ఏపీ సీఎం చంద్రబాబు దేవుడిలా.. బనకచర్ల కోసం పోరాడిన మేము మాత్రం చచ్చిన పాములా కనిపిస్తున్నామని మండిపడ్డారు.
బీఆర్ఎస్‌ను చచ్చిన పాముతో పోల్చడంపై హరీశ్‌రావు ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ నిజంగానే చచ్చిన పాము అయితే నిద్రలో కూడా ఎందుకు కలవరిస్తున్నారని ప్రశ్నించారు. 11 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీ చచ్చిన పాము అయిందా అని నిలదీశారు. టెక్నికల్‌గా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా.. ఆయన మనసంతా ఏపీ పైనే ఉందన్న విషయం రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుందని అన్నారు.
ప్రజాభవన్ వేదికగా 2024లో రేవంత్ రెడ్డి, విజయవాడ వేదికగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గోదావరి-బనకచర్లకు పచ్చజెండా ఊపారని ఆరోపించారు. 2024లో నవంబర్ 15న ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు బనకచర్ల ప్రాజెక్టు నిధులు కావాలని లేఖ రాశారన్నారు. ఆ తర్వాత డిసెంబర్ లోనూ నిధుల కోసం లేఖ రాశారని తెలిపారు. ఈ లేఖలన్నీ బయటకు వచ్చిన రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నారని దుయ్యబడ్డారు.
జనవరి 24న ప్రెస్ మీట్‌లో తానే ఈ కుట్రను బయటపెట్టారన్నారు. ఆ తర్వతే తెలంగాణ తరపున మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంతకు ముందు డేట్ వేసి కేంద్రానికి లేఖ రాశారని ఆరోపించారు. బీఆర్ఎస్ చేసిన పోరాటం వల్లే బనకచర్ల ప్రాజెక్టు టీఓఆర్ తాత్కాలికంగా ఆగిందన్నారు. ఇది బీఆర్ఎస్ పోరాట ఫలితమేనని స్పష్టం చేశారు. ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో బనకచర్ల అంశం చర్చకు రాలేదన్నారు. సముద్రంలోకి వృథాగా పోతున్న 3 వేల టీఎంసీల నీటిపై ఇరు రాష్ట్రాలు కూర్చుని మాట్లాడుకోవాలని మాత్రమే నిర్ణయించారని అన్నారు. తెలంగాణ సీఎంకు నదీ బేసిన్లపై కనీస అవగాహన లేదని, అహంకారంతో మాట్లాడితే ప్రజలు అణగతొక్కడం ఖాయమని హెచ్చరించారు.