Road Accident: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు సజీవదహనం

Three Peoples Died In Accident: మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మరిపెడ మండలం ఎల్లంపేట స్టేజ్ కుడియాతండా సమీపంలో జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున రెండు లారీలు ఢీకొన్నాయి. అనంతరం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రెండు లారీలు కాలిపోయాయి. దీంతో లారీ క్యాబిన్లలో చిక్కుకుని ఇద్దరు డ్రైవర్లు, ఓ క్లీనర్ సజీవదహనమయ్యారు.
విజయవాడ నుంచి చేపల ఎరువు లోడ్ తో గుజరాత్ వెళ్తున్న లారీ.. వరంగల్ నుంచి ఖమ్మం వైపు గ్రానైట్ రాళ్ల లోడుతో వెళ్తున్న లారీ ఈరోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో గ్రానైట్ లారీపై ఉన్న బండ ఇంకో లారీ క్యాబిన్ పై పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో డ్రైవర్లు బయటకు రాలేక అందులోనే ఇరుక్కుపోయి మంటల్లో కాలిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. హైవేపై ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో అధికారులు ట్రాఫిక్ కు క్లియర్ చేశారు.