BRS: నేడు ఈసీతో భేటీకానున్న బీఆర్ఎస్ నేతలు
టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానం కాపీలను తీసుకొని ఢిల్లీకి వెళ్లారు.
BRS: టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానం కాపీలను తీసుకొని ఢిల్లీకి వెళ్లారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ నేతృత్వంలో బీఆర్ఎస్ నేతల బృందం ఢిల్లీకి వెళ్లింది. ఇవాళ ఉదయం 11 గంటలకు ఈసీతో టీఆర్ఎస్ నేతలు భేటీ కానున్నారు. అనంతరం టీఆర్ఎస్ చేసిన తీర్మానానికి సంబంధించిన పత్రాలను, అఫిడవిట్ ను అందజేయనున్నారు. ఇప్పటికే ఈసీ అధికారులతో చర్చించి సలహాలు తీసుకున్న నేతలు. ఆ నిబంధనల ప్రకారమే అఫిడవిట్ తో పాటు తీర్మాన కాపీని సిద్ధం చేశారు. అదేవిధంగా ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వివరాలను కూడా ఈసీకి అందించనున్నారు.
జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ అడుగు పెట్టనున్నందున టీఆర్ఎస్ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం మేరకు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ ఏకవాక్య తీర్మానాన్ని సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సమావేశంలో పాల్గొన్న 283 మంది ప్రతినిధులు ఈ తీర్మానాన్నిఆమోదిస్తూ సంతకాలు చేశారు. ఈ తీర్మానాన్నిసమావేశంలో కేసీఆర్ చదివి విన్పించారు.
2024 ఎన్నికల్లో దేశంలోని పలు చోట్ల కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పోటీ చేయనుంది. ఇతర రాష్ట్రాల్లో తమతో మిత్రులుగా ఉన్న పార్టీలతో కలిసి బీఆర్ఎస్ పోటీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పోటీ చేయవలసిన పలు స్దానాలను బీఆర్ఎస్ గుర్తించింది. కర్ణాటకలో బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేస్తామని మాజీ సీఎం కుమారస్వామి ప్రకటించిన విషయం తెలిసిందే.