Nominated Posts : ఏపీలో నామినేటెడ్ పదవుల జాతర.. 38 మార్కెట్ కమిటీలకు చైర్మన్ల పేర్లు ప్రకటన

Nominated Posts : ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పదవుల కేటాయింపు పరంపర కొనసాగుతోంది. ఇందులో భాగంగా 38 మార్కెట్ కమిటీలకు చైర్మన్ల పేర్లను తాజాగా సర్కారు ప్రకటించింది. ఏఎంసీ చైర్మన్ పదవుల్లో 31 టీడీపీ, ఆరు జనసేన, ఒకటి బీజేపీ నేతలకు కేటాయించింది సర్కారు. చైర్మన్ల ఎంపికలో ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీల చైర్మన్లను ప్రకటిస్తామని కూటమి సర్కారు స్పష్టం చేసింది. అందుకోసం కసరత్తు జరుగుతోందని పేర్కొంది.
2024లో ఎన్నికల్లో కూటమికి పట్టం..
2024లో జరిగిన ఎన్నికల్లో ఏపీ ఓటర్లు కూటమికి పట్టం కట్టారు. దీంతో చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి సర్కారు కొలువు తీరింది. ఈ ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేశాయి. ఈ క్రమంలోనే సీట్ల సర్దుబాటులో భాగంగా పలువురు సీనియర్లు ఎన్నిక వేళ సీట్లు వదులు కోవాల్సి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టులు కట్టబెడతామంటూ వారికి హామీ ఇచ్చారు. ఇక ఎన్నికల్లో కూటమి మొత్తం 175కి 164 స్థానాలకు గెలుచుకుంది.
నామినేటెడ్ పోస్టుల భర్తీకి శ్రీకారం..
ఈ నేపథ్యంలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి చంద్రబాబు సర్కారు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా పలువురు సీనియర్ నేతలకు ఇప్పటికే విడతల వారీగా కీలక పోస్టులు కేటాయించింది. కేటాయింపుల్లో సైతం మిత్ర ధర్మం పాటీస్తూ చంద్రబాబు సారథ్యంలోని కూటమి సర్కారు ముందుకెళ్తోంది. ఆ క్రమంలో ఏఏంసీ చైర్మన్ల పేర్లను ప్రకటించారు. మిగతా వారి పేర్లను మరికొద్దీ రోజుల్లో ప్రకటించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.