YS Jagan : తెనాలిలో వైఎస్ జగన్ పర్యటన.. దళిత, ప్రజాసంఘాల ఆందోళన
Protests against YS Jagan visit to Tenali : గుంటూరు జిల్లా తెనాలిలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మంగళవారం పర్యటించారు. పర్యటన కోసం కార్యకర్తలు అన్ని ఏర్పాట్లు చేశారు. జగన్‌కు మాత్రం నిరసనల రూపంలో ఊహించని షాక్ తగిలింది. పర్యటనను వ్యతిరేకిస్తూ దళిత, ప్రజాసంఘాలు రాస్తారోకో నిర్వహించాయి. తెనాలి మార్కెట్ సెంటర్‌లో మానవహారంగా చేపట్టి ఆందోళన చేశారు. వైసీపీ హయాంలో హత్యకు గురైన నూతక్కి కిరణ్‌ను జగన్ పరామర్శించలేదని, రౌడీషీటర్లకు మద్దతుగా నిలువడం దారుణమంటూ దళిత, ప్రజాసంఘాలు నినాదాలు చేశాయి. తెనాలిలో మాజీ సీఎంకు నిరసనల సెగ తగలడంతో వైసీపీ నేతలు డైలామాలో పడ్డారు.
అడ్డుకున్న ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు..
ఐతానగర్ కేంద్రంలో జగన్‌ను ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. జగన్ గో బ్యాక్ అంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. తెనాలిలో ఎర్రబడి వద్ద జగన్ కాన్వాయ్‌ను ఎమ్మార్పీఎస్, దళిత సంఘాల నేతలు అడ్డుకున్నారు. దళితులపై ఇప్పుడు ప్రేమ పుట్టుకొచ్చిందా అంటూ నిరసన వ్యక్తంచేశారు. హత్యలు చేసిన వారిని, రౌడీషీట్లు ఉన్నవారిని, పోలీసులను కొట్టిన వారిని జగన్ ఎలా పరామర్శిస్తారని ఎమ్మార్పీఎస్ నేతలు నిలదీశారు. నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసన తెలిపారు. రోడ్డుపై వస్తున్న దళిత సంఘాలను పోలీసులు అడ్డుకున్నారు. తెనాలిలో భారీగా పోలీసులు మోహరించారు. దీంతో తెనాలిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.