Chandrababu: 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి : ఏపీ సీఎం చంద్రబాబు

CM Chandrababu Comments On YS Jagan: వైసీపీ హయాంలో రాష్ట్రం ధ్వంసమైందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఐదేళ్లపాటు కేంద్ర పథకాలను పక్కదారి పట్టించారని విమర్శించారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఎప్పటికప్పుడు సమన్వయంతో ముందుకెళ్తున్నాయని చెప్పారు. ఆదివారం మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం మాట్లాడారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలకు దిశానిర్దేశం చేశారు.
ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి..
రాష్ట్ర విభజన సందర్భంగా అనేక సమస్యలు వచ్చినా నిలదొక్కుకున్నామని తెలిపారు. వైసీపీ పాలనతో రాష్ట్రం ధ్వంసమైందన్నారు. విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్తామని ప్రజలకు చెప్పామన్నారు. ప్రజలు సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఐదేళ్లలో మనం ఏం చేయాలనే దానిపై చర్చించామని పేర్కొన్నారు.
ఇచ్చిన మాట ప్రకారం సుపరిపాలనలో మొదటి అడుగు వేశామన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ప్రజల ఆకాంక్షలను మనం నెరవేర్చాలని సూచించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు. అది మన బాధ్యత అన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. భవిష్యత్‌లో ఏం చేస్తామో స్పష్టంగా చెప్పాలని కోరారు. ఎన్నికల్లో దామాషా ప్రకారం అందరికీ న్యాయం చేశామని స్పష్టం చేశారు. సంక్షేమం అంటే ఏంటో చూపించిన పార్టీ తెలుగు దేశమన్నారు. ఆర్థిక సంస్కరణలు అందిపుచ్చుకుని పరిపాలన చేశామని, చేసిన పనిని ప్రజలకు చెప్పడం ముఖ్యమన్నారు.
పంద్రాగస్టు నుంచి వాట్సప్ గవర్నెన్స్‌లో 703 సేవలు..
బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఎప్పుడూ చేయబోమన్నారు. కేంద్రం బాగా సాయం చేస్తోందని వివరించారు. సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయని చెప్పడం లేదని, ఇంకా చాలా పరిష్కరించాలన్నారు. అదే మన లక్ష్యం కావాలన్నారు. సేవ, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్లు పెంచి ఇస్తున్నామన్నారు. పంటలకు మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకుంటున్నామని చెప్పారు. అమరావతి నిర్మాణానికి రూ.15వేల కోట్లు మంజూరు చేశామని, రాజధాని ప్రాంతంలో పనులను పట్టాలెక్కించామన్నారు.
పోలవరం ప్రాజెక్టుకు రూ.12,500 కోట్లు కేంద్రం ఇచ్చిందన తెలిపారు. రాబోయే ఏడాదిన్నరలో ప్రాజెక్టును పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 నాటికి జాతికి అంకితం చేస్తామన్నారు. స్టీల్‌ప్లాంట్‌కి రూ.11,400 కోట్లు కేంద్రం మంజూరు చేసిందన్నారు. క్రిష్ సిటీలో పనులు ప్రారంభయ్యాయని వివరించారు. ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకున్నామని పేర్కొన్నారు. వాట్సప్ గవర్నెన్స్‌తో సుమారు 500 సేవలు ఆన్‌లైన్‌లో అందిస్తున్నామని, పంద్రాగస్టు 15 నాటికి 703 సేవలు ఆన్‌లైన్‌లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. దీనివల్ల అవినీతి తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పాలన అందించే అవకాశం ఉంటుందన్నారు.