Nara Lokesh: అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్లే వ్యవహరించాలి: మంత్రి లోకేశ్

Minister Nara Lokesh: అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్లే వ్యవహరించాలని మంత్రి నారా లోకేశ్ సూచించారు. ప్రజల్లో ఉంటూ సమస్యలు పరిష్కరించేందుకు కష్టపడాలని కోరారు. టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. వైసీపీ 151 సీట్లు 11 అయ్యాయంటే దానికి కారణం వారి అహంకారమేనని స్పష్టం చేశారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తల్లికి వందనం అమలు చేశామని చెప్పారు. ఇచ్చిన ప్రతి హామీ పూర్తిచేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. దేవాలయం లాంటి పార్టీ కార్యాలయంపై దాడిచేస్తే పట్టించుకోని పరిస్థితి ఆనాటి పాలనలో చూశామని ధ్వజమెత్తారు.
కష్టపడిన కార్యకర్తలను మరువొద్దని నాయకులను కోరారు. పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. మనం ఎక్కడ కూర్చోవాలో ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు. పార్టీ వ్యవస్థలో మహిళలను పెద్దఎత్తున భాగస్వాములను చేస్తామన్నారు. అనుబంధ విభాగాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించాలన్నారు.
జులై 5 నాటికి కమిటీలను పూర్తిచేయాలని ఆదేశించారు. సీనియర్లకు ఉన్న అనుభవం, యువతకు ఉన్న శక్తి రెండింటినీ జోడించాల్సిన అవసరం ఉందని చెప్పారు. సీనియర్లే నాలుగు దశాబ్దాలు పార్టీని ముందుకెళ్లారని తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాలని సూచించారు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలని కోరారు. నెల రోజులపాటు అందరం డోర్ టూ డోర్ ప్రచారం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.